న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందన్న నివేదికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ”దేశాన్ని ఎవరిముందు తలవంచనీయమని చెప్పారు. మీరు ఇదివరకూ ఇచ్చిన వాగ్దాలను గుర్తు చేసుకోండి” అంటూ ట్వీట్ చేశారు. దీనికి చైనా ఆక్రమించిన భారత భూభాగం చిత్రాలను, కొత్తగా డ్రాగన్ నిర్మించిన గ్రామం సంబంధిత ఫోటోలను జోడించారు.
అలాగే, కాంగ్రెస్ నేత సూర్జేవాలా సైతం మోడీపై విమర్శలు గుప్పించారు. ”మోడీ జీ ఆ 56 అంగుళాల ఛాతీ ఎక్కడుంది”అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ సీనీయర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. ఆరుణాచల్ ప్రదేశ్లోని వివాదాస్పద ప్రాంతంలో చైనా 100 గృహాలతో కూడిన ఓ గ్రామాన్ని నిర్మించిందనీ, దీనిపై మోడీ సర్కారు ఏం వివరణ ఇవ్వనుందో తెలపాలంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ నివేదికలను జాగ్రత్తగా గమనిస్తున్నామనీ, దేశ భద్రతపై ప్రభావం ఉన్న అన్ని పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచామని పేర్కొంది. సరిహద్దుల్లో మౌలిక వసతులు మెరుగుపరేచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.