ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్-బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికారంలో ఉండి మీరేం ఒరగబెట్టారంటే..మీరేం వెలగబెట్టారంటూ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి హడావిడి చూస్తే కొద్ది నెలల్లో ఎన్నికలున్నాయా అన్న టెన్షన్ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తుందట..అవినీతి ఆరోపణలతో పరస్పరం సవాళ్లు విసురుకుంటున్న టీఆర్ఎస్ బీజేపీ నేతల హడావిడి ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. వీలైతే డైరెక్ట్‌గా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు. లీగల్, ఇల్లీగల్ దందాలపై ప్లేస్ ఫిక్స్ చేసుకోని బహిరంగ చర్చకు సిద్ధమని హీట్ పుట్టిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తొలిసారి పాలమూరు పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన నారాయణపేట రైతు సదస్సులో పాల్గొన్నారు. అప్పటి నుంచే విమర్షల వాడి వేడి పెరిగింది.
ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సైతం నారాయణపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచే బరిలో నిలుస్తారనే ప్రచారం జోరందుకుంది. మారిన రాజకీయ పరిణామాల ప్రభావం నారాయణపేటలో కూడా కనిపిస్తోంది. ఇటీవల ధన్వాడలో రైతు వేదికపై ప్రధాని మోడి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిల పర్యటనను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటి నుంచి డికే అరుణతోపాటు స్థానిక బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇరుపార్టీల నేతలు స్థానికంగా ఉన్న సెంటర్‌చౌక్‌లో బహిరంగ చర్చకు బయలుదేరడంతో పోలీసులు ఇరుపార్టీల నేతలను అరెస్టు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, విలువైన భూముల కబ్జాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు ఇరు పార్టీల నేతలు. బీజేపీ అగ్రనాయకులు నారాయణపేటకు క్యూకట్టి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మండిపడుతున్నారు. వీరి హడావిడి చూసిన స్థానికులు నారాయణపేటకు అప్పుడే ఎన్నికలొచ్చాయా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.