ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని.. జోడో యాత్రలో రాహుల్ గాంధీ

-

కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ మాట్లాడారు.

“రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి. భారత్ జోడో యాత్ర దేశ సమగ్రతకు సంబంధించింది. మా పార్టీ అందరిది. మేం దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడదీయాలని చూడడం లేదు. ఏపీలో పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది.” అని రాహుల్ గాంధీ అన్నారు.

ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్ లా చూస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరడం దారుణమని అన్నారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డ రాహుల్.. ఏపీలో వైసీపీతో మద్దతు అంశం అధ్యక్షుడి పరిధిలో వుంటుందని స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామని వెల్లడించారు. తన దృష్టి అంతా భారత్ జోడో యాత్రపైనే ఉందని.. యాత్రలో భాగంగా అందరినీ కలసి వారు సమస్యలు తెలుసుకుంటున్నానని చెప్పారు.

“భారత్ ఆర్థికవ్యవస్థను కాపాడాలి. బీజేపీ విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. ఉద్యోగాల కల్పన జరగలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. ప్రపంచంలో మూడో అత్యంత ధనికుడు మోదీ మిత్రుడు. పేదలు పేదలుగా మిగిలిపోతున్నారు. రాబోయే రోజుల్లో నేను ఎలాంటి పాత్ర పోషించాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తారు. దేశంలో రూపాయిని బలోపేతం చేయాలి. దేశంలో వన్ జీఎస్టీ-వన్ ట్యాక్స్ రావాలి. దేశంలో కుల రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోంది.” అని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news