ఉప్పూ నిప్పులా ఉండే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విషయంలో మాత్రం రాజకీయాలను పక్కనబెట్టారు. ఈ ఆసక్తికర సంఘటన కర్ణాటకలో జరిగింది. గాయపడిన ఓ ఏనుగు విషయంలో రాజకీయాలను పక్కనబెట్టి ఇరు పార్టీల నేతలు మానవత్వం చాటుకున్నారు.
గాయపడిన ఏనుగును రక్షించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సాయం కోరారు. అందుకు సీఎం బసవరాజ్ బొమ్మై సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఇరు పార్టీ నేతలూ కత్తులు దూసుకుంటున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
భారత్ జోడో యాత్ర విరామం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి బుధవారం నాగరహళ్లి టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు. అక్కడ ఓ గున్న ఏనుగు గాయపడి ఉండడం ఆయన గమనించారు. వెంటనే గాయపడిన గున్న ఏనుగు తన తల్లి వద్ద సేద తీరుతూ ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆ గాయపడిన ఏనుగుకు వైద్య సాయం అందించాలని కోరుతూ సీఎం బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. రాజకీయాలు పక్కన పెట్టి తన వినతిపై స్పందించాలని కోరారు.
దీనిపై బొమ్మై సానుకూలంగా గురువారం స్పందించారు. అటవీ అధికారులతో మాట్లాడాతానని, అన్ని వివరాలూ తెప్పించుకుంటానని పేర్కొన్నారు. గాయపడిన ఏనుగుకు ఏవిధమైన వైద్య సాయం అందించగలమన్న చర్చిస్తామన్నారు. ఏనుగును రక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
A mother’s love.
I felt so sad to see this beautiful elephant with her injured little baby fighting for its life. pic.twitter.com/65yMB37fCD
— Rahul Gandhi (@RahulGandhi) October 5, 2022