ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు ఈ నెల 7న రానున్నారు. ఈ సందర్భంగా చంచల్‌గూడ జైలులోని పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నేతలను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. చంచల్‌గూడ జైలులోకి రాహుల్ గాంధీని అనుమతించాలంటూ గురువారం నాడు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు చంచల్‌గూడ్ జైలులోకి రాహుల్‌ను అనుమతించాలని డీజీని కోరారు రేవంత్ రెడ్డి.
ఉస్మానియా విద్యార్థులతో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ వర్సిటీకి వస్తారని అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే ఓయూ వీసీకి టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. అయితే వర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ అందుకు అనుమతించక పోవడంతో.. ఈ నేపథ్యంలో కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్‌యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిని కలిసేందుకే రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు వస్తారని, అనుమతించాలని డీజీని రేవంత్ రెడ్డి కోరారు.