తమిళనాడును వరసగా వర్షాలు భయపెడుతున్నాయి. గత నెల కాలంగా తమిళనాడు భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాలు, అల్పపీడనాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాలు చురుకుగా ఉండటంతో ఆ రాష్ట్రాన్ని వర్షాలు విడవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో చెన్నై నగరంతో పాటు కోస్తా జిల్లాలు, తమిళనాడు డెల్టా ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా చెన్నై నగరంలోని రోడ్లు, కాలనీలు నదులు, చెరువులను తలపించాయి.
తాజాగా మరోసారి తమిళనాడుకు వర్షం ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చిరించింది. మరో మూడు గంటల్లో తమిళనాడుతో పాటు, పుదుచ్చేరిలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుక్కుడి జిల్లాల్లో కొన్ని చోట్ల, రామనాథపురం, శివగంగై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, తంజావూరులోని తంజావూరు, పుదుచ్చేరిపై 1-2 చోట్ల రాగల 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.