పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి వారంలోనే 52.30శాతం రాజ్యసభా సమయం వృథా అయింది. ప్రతిపక్ష పార్టీలు నిరవధికంగా ఆందోళన చేపడుతుండటంతో అంతరాయం, తప్పనిసరి వాయిదాల రూపంలో ఎగువ సభ సమయం వృథాగా పోయినట్లు తెలుస్తున్నది. ఏదిఏమైనా డిసెంబర్ 2 , 3వ తేదీల్లో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని, నిర్దేశి సమయంలో దాదాపు 95శాతం చర్చ జరిగింది. శుక్రవారం మాత్రం 100శాతం సభ నిర్వహణ సజావుగా సాగింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇరు సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సభ సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడంతో పార్లమెంట్ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కరు చొప్పున సస్పెన్షన్‌కు గురయ్యారు.