పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ ‘రామబాణం’లో, గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి అలరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును రాజమండ్రిలో నిర్వహించారు. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసే జగపతిబాబు .. ఆయనను దెబ్బతీయడానికి విలన్ చేసే ప్రయత్నంగా ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది. జగపతిబాబును సపోర్టు చేసే తమ్ముడిగా గోపీచంద్ కనిపిస్తున్నాడు. విలన్ బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో రంగంలోకి దిగడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.
“నేను హైవేలో డేంజర్ బోర్డులాంటివాడిని .. వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా స్పీడ్ తగ్గించకపోతే .. చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది” అంటూ గోపీచంద్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఈ సినిమాకి హైలైట్. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. శ్రీవాస్ ‘రామబాణం’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చేయనున్నారు.