వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూసూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. అలాగే కోరిన వారికి సాయం చేస్తూ.. ఈ కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తూ మానవత్వం చాటుకుని రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న ఆయనకు తాజాగా మరో గౌరవం లభించింది.
డాక్టర్ రామినేని ఫౌండేషన్ 21వ వార్షికోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి 2020 సంవత్సరానికి గాను డాక్టర్ రామినేని పురస్కారాలను అనౌన్స్ చేశారు. ఈ అవార్డులను సంస్థ ఛైర్మన్ రామినేని ధర్మచక్ర, కన్వీనర్ పాతూరి నాగభూషణంలు ప్రకటించారు. ఈ అవార్డులు పొందిన వారు ఇలా ఉన్నారు. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులుకు విశిష్ట పురస్కారం లభించగా సినీనటుడు, సంఘ సేవకుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం ఇస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు, బ్యాడ్మింటిన్ అంపైర్ వేమూరి సుధాకర్ కు, సంఘ సేవకుడు బండ్లమూడి శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలు అందచేయనున్నారు. త్వరలో ఈ అవార్డుల ప్రదాన తేదీని కూడా ప్రకటిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.