ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోహన్ భగవత్ వి చిల్లర మాటలు అని, హిందూ ముస్లింలను వేరు చేసే కుట్ర అని ఫైర్ అయ్యారు. అసలు మోహన్ భగవత్ ఎవరిని ప్రశ్నించిన కేటీఆర్.. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్ గానైనా గెలిచారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు.
“బ్రతికుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా కౌన్సిలర్‌గా గెలిచి చూపమంటారు నేటి బీఆర్ఎస్ మహానేతలు….లోక కళ్యాణమే ఏకైక లక్ష్యంగా ఉన్న హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ గారిని ఉద్దేశించి బందిపోట్ల రజాకార్ సమితి (బీఆర్ఎస్) నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు… ఆకాశంపై ఉమ్మి వేసేందుకు ప్రయత్నించే పిచ్చి చేష్ట తప్ప మరొకటి కాదు.
బ్రతికుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా కౌన్సిలర్‌గా గెలిచి చూపమంటారు నేటి బీఆర్ఎస్ మహానేతలు. మహోన్నత సిద్ధాంతకర్తలకు, ఎన్నికల రాజకీయాలకు పోలిక పెట్టడం వీళ్ళ అధికార అహంకారం, ధన గర్వం కాక ఇంకేంటి? ఆత్మస్తుతి – పరనింద తప్ప మరొకటి చేతగాని ఈ గులాబీ దళం నేతలకు విమర్శలను ఎదుర్కొనే సత్తా లేదు. కెసిఆర్ సర్కార్ రెండు విడతల పాలనా కాలంలోని వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడల్లా వాటికి జవాబు చెప్పే దమ్ము, ధైర్యం లేక దద్దమ్మల్లా సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటారు.
మోహన్ భాగవత్ గారిని ఉద్దేశించి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలే అందుకు పెద్ద ఉదాహరణ. మోహన్ భగవత్ లాంటి సిద్ధాంతకర్తలు దేశంలోని హిందూ వ్యతిరేక శక్తులకు సింహస్వప్నంలా ఉంటారు. TRS, BRS లా RSS పార్టీ పరంగా రాజకీయాలు చేయాలనుకుంటే దాని ప్రభావన్ని ఊహించలేము. కానీ నమ్మిన సిధాంతాల కోసం అలుపెరుగనిపోరాటం చేస్తున్న భగవత్ గారిని సవాల్ చేసే స్థాయి BRS కు లేదు”. అన్నారు.