జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదలైన ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం మొదటి అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. మొదటి రోజు ఎపిసోడ్ లో నవ్వులతో ఆద్యంతం రక్తి కట్టించగా, రెండవ ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమా మాదిరి ఉత్కంఠకు గురి చేసింది. ప్రశ్నల పర్వంలో రామ్ చరణ్ చెప్పిన సమాధానాలు, తీసుకున్న సలహాలు, మాట్లాడిన మాటలు షోని ఆసక్తికరంగా మార్చేసాయి. మొదటి పది ప్రశ్నల వరకు ఎలాంటి తడబాటు లేకుండా చకచకా నడిపించిన రామ్ చరణ్, మూడు లక్షల చెక్కు అందుకుని మిగతా ప్రశ్నల్లోకి వెళ్ళిపోయారు.
ఆ మూడు లక్షల చెక్కుని కోవిడ్ నిబంధనల వల్ల చేతికి ఇవ్వలేదు. కానీ మీ ఆటోగ్రాఫ్ చూడాలని రామ్ చరణ్ కోరగా, ఎన్టీఆర్ తన సంతకాన్ని చూపించాడు. దానికి మీ ఆటోగ్రాఫ్ బాగుందని పొగడ్తలు కురిపించాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఒక ప్రశ్నకి సమాధానం కోసం తడబడ్డ రామ్ చరణ్, లైఫ్ లైన్ వాడుకున్నాడు. రానాకి కాల్ చేసి 1971లో పాకిస్తాన్ తో జరిపిన యుద్ధంలో వాడిన ఎస్ ఎస్ ఘాజీ అసలు పేరు చెప్పమని అడగ్గా, రానా సరైన సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది.
ఆ తర్వాత ప్రశ్నకి రామ్ చరణ్ లైఫ్ లైన్ వాడుకున్నాడు. 50-50లైఫ్ లైన్ వినియోగించుకుని 25లక్షలు గెలుచుకున్నాడు. 50లక్షల ప్రశ్నకు సిద్ధం అవుతుండగా, షో ముగిసినట్లు గంట మోగింది. రామ్ చరణ్ గెలుచుకున్న 25లక్షల రూపాయలను సమాజ సేవకు ఉపయోగిస్తానని అన్నాడు. ఈ మేరకు ఎన్టీఆర్ అభినందనలు తెలిపాడు. మొత్తానికి రెండవ రోజు ఆట ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది.