మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లంతా ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వచ్చారు. కానీ ఓ గ్రామం వాసులు మాత్రం తాము ఓటు వేయం అంటూ భీష్మించుకు కూర్చుకున్నారు. నల్గొండ జిల్లా గుట్టుప్పల్ మండలం రంగంతండా వాసులు ఉపఎన్నిక పోలింగ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోమని మొండికేశారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చేవరకు ఓటేసి లేదని ఎన్నికలను బహిష్కరించారు.
గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని.. సమస్యపై చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు వాపోయారు. టీఆర్ఎస్ నేతలు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ గ్రామస్థులతో ఫోన్లో మాట్లాడి తొలుత పొలింగ్ స్టేషన్కి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకోమని.. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి ఓటేసేందుకు వెళ్లారు.