కొండ‌పి వైసీపీలో అసంతృప్తి సెగ‌లు.. రీజ‌నేంటి..?

-

ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం.. కొండ‌పి. ఇక్క‌డ ప‌ట్టు సాధిచేందుకు వైసీపీ ఎంత‌గా ప్ర‌య‌త్ని స్తున్నా.. సాధ్యం కావ‌డం లేద‌నే టాక్ ఉంది. వైసీపీ కొండపి నియోజకవర్గ నాయకుల్లో గత సాధారణ ఎన్నికలకు ముందే వర్గ విభేదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. అప్పట్లో పార్టీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌కుమార్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా పార్టీ నేతలు విడిపోయారు. వివిధ పరిణామాల నేపథ్యంలో అశోక్‌ కుమార్‌ని తప్పించి ఎన్నిక‌ల‌కు ముందు డాక్ట‌ర్‌ వెంకయ్యను రంగంలోకి తీసుకొచ్చి పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. అయితే, ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ గాలి వీచినా.. దానిని త‌న‌వైపు మ‌ళ్లించుకునే వ్యూహం చేయ‌లేక పోయారు.

నిజానికి 2014లోనూ వైసీపీ ఇక్క‌డ‌కీల‌క నేత‌ను రంగంలోకి దింపింది. ఎస్సీ రాష్ట్ర నాయ‌కుడు జూపూడి ప్ర‌భాక‌ర్‌ను ఇక్క‌డ నుంచి పోటీకి పెట్టారు. అప్ప‌ట్లోనూ ఇలానే గ్రూపు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయో.. లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. ప్ర‌భాక‌ర్ ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇటీవ‌ల మ‌ళ్లీ ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే, ప్ర‌స్తుతం డాక్ట‌ర్ వెంక‌య్య‌పై మ‌ళ్లీ అసంతృప్తి జ్వాల‌లు పెల్లుబికాయి. ఇక్క‌డ గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి.  వెంక‌య్య గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఇక్క‌డ ఇన్‌చార్జిగా నియ‌మించ‌డంతోపాటు పార్టీని డెవ‌ల‌ప్ చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించి అదే స‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిని కూడా అప్పగించారు.

అయితే, ఆయ‌న హ‌యాంలోనూ నేత‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని చిన్న‌పాటి ప‌ద‌వులు కూడా ఇప్పించలేక పోతున్నార‌ని, అదేస‌మ‌యంలో ఖాళీగా ఉన్న 10వ‌లంటీర్ పోస్టుల‌ను కూడా త‌మ వారికి ఇవ్వ‌లేద‌ని ఇక్క‌డి నేత‌లు ర‌గిలిపోతున్నారు. ఈ క్రమంలో నేత‌లు రెండుగా చీలిపోయారు. వెంక‌య్య‌కు అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాలుగా మారిపోయారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. కొండపి మండలంలో కె. ఉప్పలపాడుకి చెందిన పిచ్చిరెడ్డి, అలాగే వెంకటాద్రిరెడ్డి తదితర నాయకుల సారథ్యంలో పలు గ్రామాల వారు ఒక గ్రూపుగా ఏర్పడి వెంకయ్య విధానాలను నిరసిస్తూ పనిచేయటం ప్రారంభించారు.

అంతేకాదు, ఇటీవ‌ల వీరంతా పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని కలిసి వెంకయ్యపై ఫిర్యాదులు చేశారు.  మర్రిపూడి మండలంలో వాకా వెంకటరెడ్డి, రమణారెడ్డి, నాగయ్య తదితరుల సారథ్యంలో ఒకవర్గం.. విజయభాస్కర రెడ్డి, మల్లికార్జునరావుల సారథ్యంలో మరోవర్గం ఏర్పడింది. విజయభాస్కర రెడ్డి ఇటీవల గ్రామగ్రామానా పర్యటించి వెంకయ్యకు వ్యతిరేకంగా నాయకులను సమన్వయం చేసే కార్యక్రమం నిర్వహించారు. తొలి నుంచీ పార్టీలో ఉన్న వారికి వ్యతిరేకంగా వెంకయ్య పనిచేస్తున్నాడంటూ మంత్రి బాలినేనిని కలిసి ఫిర్యాదులు చేశారు. ఈ ప‌రిణాలతో కొండ‌పి వైసీపీ రాజ‌కీయ మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మార‌డంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news