డిప్యూటీ సీఎం, గిరిజన శాఖా మంత్రి పుష్ప శ్రీవాణి ఇటీవల కాలంలో చాలా మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఎవరితోనూ ఆమె టచ్‌లో ఉండడం లేదు. పైగా పార్టీలోనూ యాక్టివ్‌గా ఉండడం లేదు. దీంతో ఆమె మౌనానికి కారణమేమై ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఆది నుంచి పార్టీలో దూకుడుగా ఉండే స్వభావం ఉన్న నాయకురాలుగా పుష్ప శ్రీవాణి గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్సార్‌తో అనుబంధం తర్వాత.. జగన్ పట్ల అభిమానం.. పార్టీపై విశ్వాసం వంటివి పుష్కలంగా ఉన్న శ్రీవాణి… విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. వైసీపీ అంటే ఎనలేని అభిమానం.. అందుకే ఆమె గత చంద్రబాబు హయాంలో తనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినా.. పార్టీ మారకుండా పనిచేశారనే వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనేజగన్ విధేయతకు వీరతాడు అన్నట్టుగా శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. ఇక, రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా ఆమె యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా ఆమె పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇది రాజకీయంగా చర్చకు వస్తోంది. ఎందుకు పుష్ప శ్రీవాణి మౌనం వహిస్తున్నారు? గతంలో టిక్‌టాక్‌లు కూడా చేసి.. జగన్‌కు జోష్ పెంచిన నాయకురాలి మౌనం వెనుక ఏం జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై కూపీలాగగా.. విజయనగరం జిల్లాలో పెత్తనం చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. అన్ని నియోజకవర్గాల్లోనూ తనదే పైచేయి కావాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
అధికార పార్టీ నుంచి విపక్షం వరకు ఆయన ఎవరినీ వదిలి పెట్టకుండా.. అంతా నేనే.. అంతా నాదే.. అనే టైపులో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో కాకపోయినా.. ఆమె తీసుకుంటున్న నిర్ణయాల్లో వేలు పెడుతున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె రాకముందుగానే బొత్స వచ్చి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మరికొన్ని కార్యక్రమాల్లో పుష్ప శ్రీవాణి ముందుగానే హాజరైనా బొత్స వచ్చే వరకు కూడా ఆయా కార్యక్రమాలు మొదలవడం లేదు.
దీంతో కినుక వహించిన పుష్ప శ్రీవాణి.. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుంటే.. సొంత మామగారే.. జగన్‌పైనా, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, వాటిని ఖండించలేని స్థితిలో శ్రీవాణి ఉండడం కూడా ఆమెకు మైనస్‌గా మారాయని. అందుకే ఆమె మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.