అనాథ పిల్లలను ‘స్టేట్ చిల్డ్రన్’గా గుర్తిస్తూ కీలక ప్రకటన చేశారు సిఎం కేసీఆర్. అనాథ శరణాలయాలను కూడా ఆదుకుని, ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు స్కూళ్లు ఏర్పాటు చెయ్యబోతున్నామని వెల్లడించారు. ప్రభుత్వమే అండగా ఉండాలనే మానవీయ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సిఎం కేసీఆర్.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ కూడా ఉచితాల కిందకే వస్తాయా ? అనాథ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో కూడా వాళ్లకు కొంత రిజర్వేషన్ కల్పించడంతోపాటు గ్రాంట్లు కూడా పెంచాలని నిర్ణయించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు సీఎం కేసీఆర్. మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే.. వాళ్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని వివరించారు సీఎం కేసీఆర్. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిఫారసు మేరకు డయాలసిస్ పేషెంట్లకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.