వోటింగ్ దెబ్బ : అమెరికాలో ఒక్క రోజే లక్ష కరోనా కేసులు !

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏదయినా సంచలన అంశం ఉందా అంటే అది అమెరికా అధ్యక్ష ఎన్నికలని చెప్పక తప్పదు. గత రెండు రోజులుగా అమెరికాలో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు అమెరికా వరకే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో ఆ దేశం కొత్తగా నమోదవుతోన్న కరోనా వైరస్ కేసుల విషయంలో కూడా రికార్డులు బద్దలు అవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో లక్షకు చేరువగా కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. నిన్న రాత్రి సమయం కల్లా అక్కడ 99వేల 660 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 1,112 మంది ఈ కరోనా వైరస్ బారిన పడి మరణించారని తేలింది. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఈ కేసులు బయట పడ్డాయి. కాగా, ఇప్పటివరకు ఆ దేశంలో 94 లక్షల మంది వైరస్ బారిన పడగా 2లక్షల33వేల మంది మరణించారు.