ఈ రోజుల్లో ఏ రాష్ట్రంలోనూ రోడ్ల పరిస్థితి బాలేదు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది..కొన్ని ఏరియాల్లో అయితే గుంతల్లో రోడ్లను వెతుక్కోవాల్సి వస్తుంది. రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు మొర పెట్టుకుంటుంటారు. ప్రభుత్వం స్పందించకుంటే..చేసేదేమి లేక అదే మార్గంలో అలాగే రాకపోకలు సాగిస్తుంటారు. పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటే.. గ్రామస్థులే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటారు. అయితే ఓ గ్రామంలో రోడ్లు ధ్వంసమయ్యి.. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడి దృశ్యాలను వీడియో తీస్తూ న్యూస్ రిపోర్టర్స్ లైవ్ న్యూస్ కవర్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఊహించని ఘటన జరిగింది.
రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో.. అతని వెనక నుంచి రోడ్డు అంతా గుంతలు పడి, బురదతో నిండి ఉంటుంది.. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ఎలక్ట్రిక్ ఆటో గుంతల మీదుగా వెళ్తూ బురదలోనే బోల్తా పడింది. అందులో ఉన్నవారంతా ఆ నీటిలో పడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో జరిగింది. అప్పటికే వీడియో తీయడంతో..ఆటో గుంతలో పడిపోవడం కూడా కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీయూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టారు. ఇంతకుముందు ఈ ప్రాంతంలో పలు వాహనాలు పడిపోయాయని.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ వీడియోలోని వ్యక్తి చెబుతున్నారు. అలా చెబుతుండగానే వెనుక ఆ రోడ్డుపై వెళుతున్న ఆటో బోల్తా పడటం హైలెట్.. వెంటనే ఆయన వీడియో తీయడం ఆపేసి ఆటోలోని వారిని రక్షించాడు.
ఆయనతో పాటు సమీపంలోని వ్యక్తులు కూడా బోల్తా పడిన ఆటోలోని వారిని బయటికి తీశారు. ఘటనపై స్పందించిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్టు సమాచారం. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో లైక్స్, వ్యూస్ వచ్చాయి. ఆంధ్రాలోనూ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే..వాహనదారులకు వెన్నులో వణుకుపడుతుంది.