వైఎస్సార్ కోసం రేవంత్-షర్మిల పోటీ..!

-

దివంగత వైఎస్సార్ ఇమేజ్ కోసం తెలంగాణలో ఇటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు వైఎస్సార్ తనయురాలు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గట్టిగానే పోటీ పడుతున్నారు. ఎలాగో ఏపీలో వైఎస్సార్ ఇమేజ్‌ని పూర్తిగా జగన్ వాడుకుంటున్నారు. వైసీపీ ద్వారా అక్కడ ఆయన సత్తా చాటుతున్నారు. వైఎస్సార్ సెంటిమెంట్ తో రాజకీయంగా సక్సెస్ అయ్యారు. ఇక అదే సెంటిమెంట్ తో గతంలో వైఎస్సార్ చేసిన పాలనని చెప్పుకుంటూ తెలంగాణలో కూడా రాజకీయంగా లబ్ది పొందాలని ఇటు రేవంత్, అటు షర్మిల ట్రై చేస్తున్నారు.

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ అని, ఆయన ఏం చేసిన అది కాంగ్రెస్ పార్టీకే వస్తుందని రేవంత్ అంటున్నారు. వైఎస్సార్ బిడ్డగా…ఆయన ఏం చేసినా తమకే వస్తుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల తిరుగుతున్నారు. అయితే ఇప్పటికే షర్మిల పాదయాత్ర చేశారు. ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ పూర్తిగా వైఎస్సార్ స్పూర్తితో పాదయాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో యాత్ర పేరుతో వైఎస్సార్ ఏ విధంగా పాదయాత్ర చేశారో..అదేవిధంగా రేవంత్ ముందుకెళుతున్నారు. గతంలో వైఎస్సార్  పాలనని గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు.

revanth reddy

అయితే ఇలా రేవంత్ పదే పదే వైఎస్సార్ పేరుని ప్రస్తావించడంపై షర్మిల ఫైర్ అవుతున్నారు. “మహానేత వైఎస్సార్ పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు వైఎస్సార్‌ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్‌కు వైఎస్సార్ గురించి మాట్లాడే హక్కు లేదు” అని షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రేవంత్ ఎన్ని చేసిన ప్రజలు నమ్మరని అంటున్నారు.

అంటే ఇక్కడ వైఎస్సార్ ఇమేజ్ ఎక్కడ రేవంత్‌కు ఉపయోగపడుతుందనే షర్మిల ఆందోళన చెందుతున్నారు. అటు షర్మిల వైపుకు వైఎస్సార్ అభిమానులు వెళితే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఇలా ఎవరికి వారు వైఎస్సార్ ఇమేజ్ పై ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news