ప్రగతిభవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మార్చుతామని రేవంత్ తెలిపారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మార్చి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, స్టాఫ్, సాప్ట్ వేర్‌లను ఏర్పాటు చేసి వివిధ కంపెనీలతో నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వంలో ఏడాదిలోనే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేట్ సంస్థల్లోనూ భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు కృషిచేస్తామన్నారు. దీంతో పాటు గవర్నమెంట్‌లో అదనపు పోస్టులను కూడా క్రియేట్ చేస్తామన్నారు.
అంతేకాదు.. ఎట్టి పరిస్థితుల్లో హంగ్ వచ్చే ఛాన్స్ లేదని.. 80 సీట్లకు పైగా సాధించి ఈజీగా ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్ కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆయన మా పార్టీపై అనవసర నిందలు వేయడం మానుకోవాలి. ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. రూ.3 కు వచ్చే యూనిట్ కరెంట్ ని, రూ.14 కు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తాం” అని స్పష్టం చేశారు.