ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసన మండలి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. రాజకీయంగా బలంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుని అందరిని షాక్ గురించి చేసారు. వాస్తవానికి ఎన్నికలు అయిన నాటి నుంచి కూడా మండలి రద్దు జరుగుతుంది అనే ప్రచారం ఎక్కువగానే జరుగుతూ వచ్చింది. తనకు బలం లేదని జగన్ రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
అయితే అనూహ్యంగా వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసారు. దీనిపై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దలసభ రద్దు అనేది సహేతుకమైన చర్యకాదని సోమవారం మాట్లాడిన రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బిల్లు ఆమోదం పొందలేదని మండలినే రద్దు చేయడం సరికాదని, ఎన్ని రాజధానులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి, ఏపీ పరిణామాలు చూస్తే నవ్వాలో, ఏడువాలో అర్థంకావడం లేదని ఎద్దేవా చేసారు. నేతలకు పట్టుదల ఉండాలి కానీ మొండితనం ఉండకూడదని రేవంత్ హితవు పలికారు. కాగా మండలి రద్దు బిల్లు సోమవారం రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.