తెలంగాణ రాజకీయాల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడిపోయి ఉంది..దీంతో పార్టీని పైకి తీసుకురావడానికి రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. అన్నీ వర్గాల ప్రజలని కలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక తనదైన శైలిలో రేవంత్ ప్రజలని ఆకర్షించడానికి ఇప్పటినుంచే ఎన్నికల హామీలు ఇస్తున్నారు.
ఊహించని విధంగా ఇటీవల ఇళ్ళు కట్టుకునేవారికి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్‌ని రూ.500కే ఇస్తామని అన్నారు. అయితే ఈ హామీలు పేద, మధ్య తరగతి ప్రజలని ఆకర్షించేలా ఉన్నాయి. అదే సమయంలో తాజాగా పాదయాత్రలో భాగంగా ఓ వరి పొలానికి వెళ్ళి నాట్లు కూడా వేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, గోదావరి వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని కల్పిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయిన రేవంత్..తన పర్యటనలో వరద బాధితులను పరామర్శించి తనవంతు సాయం అందించారు.
ఇదే ఊపులో తాజాగా రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. అయితే ఈ ఎన్నికల హామీపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తే..కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డికి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కూడా బాగా వస్తుంది. సభలకు భారీగా జనం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలని ఇంకా ఆకట్టుకోవడానికి రేవంత్ తనదైన శైలిలో హామీలు గుప్పిస్తున్నారు. మరి ఈ హామీలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేర ఉపయోగపడతాయో చూడాలి.