మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు బెంగాల్ ప్రయోగం చేయనున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రేపో ఎల్లుండో కేంద్ర బలగాలు దిగబోతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని కిష్టాపూర్, కొంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశాల్లో రేవంత్ మాట్లాడారు.
‘‘మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ కోసం సీఆర్‌పీఎఫ్, టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పనిచేయబోతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఉద్రిక్తతలను సృష్టించి రెండు పార్టీలు ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేయబోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. సీఎం కేసీఆర్ దిల్లీలో మోదీ, షా ఆదేశాలను తీసుకొని వచ్చారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి సెంటిమెంట్ రాజేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు చేస్తున్న కుట్రలను మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.