తెలంగాణలో 2014లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని బలంగా ఎదుర్కొనడంలో విఫలమయ్యాయి. అది అందరూ చెప్పే మాటే. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో, సరైన అంశాన్ని ఎంచుకుని ఆ విషయంపై అధికార పార్టీని ఎదుర్కొనడంలో ప్రతిపక్ష పార్టీలు విజయవంతం కాలేదు. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గత రాజకీయాలతో బిజీగా ఉన్నారు తప్పితే.. తెరాస ప్రభుత్వాన్ని ఏనాడూ గట్టిగా ఎదుర్కొన్నదీ లేదు.. కానీ ప్రస్తుతం ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలంగా ఢీకొంటున్నారు. మొన్న కేటీఆర్ ఇష్యూ… నిన్న గచ్చిబౌలి టిమ్స్.. వెరసి.. రేవంత్ రెడ్డి అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆయన భిన్నంగా ముందుకు వెళ్తున్నారని.. రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారని.. తాజా పరిణామాలను గమనిస్తే మనకు స్పష్టమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ తెలంగాణలో అధికార పార్టీని ఢీకొట్టడంలో విఫలం అయింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిణామాలు కాంగ్రెస్‌కు.. అందులోనూ రేవంత్‌కు అనుకూలంగా మారాయి. ఇతర కాంగ్రెస్ నాయకులన్నా ముందుగానే ఆయన స్పందించి ముఖ్యమైన అంశాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నీ మధ్యే మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేశారంటూ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. అంతకు ముందే కేటీఆర్‌కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి నోటీసులు రావడం, తరువాత ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఆ అంశంలో నిజంగానే కేటీఆర్ తప్పు చేశారా, లేదా అన్న విషయం పక్కన పెడితే.. రేవంత్ సరైన టైంలో ఈ అంశాన్ని ఎత్తుకున్నారని స్పష్టమవుతుంది.
ఇక గచ్చిబౌలి టిమ్స్ విషయానికి వస్తే.. నిజానికి ఆ హాస్పిటల్ ప్రారంభమై దాదాపుగా 2 నెలలు కావస్తోంది. అయినా అందులో ఇప్పటికీ డాక్టర్లు, సిబ్బంది లేరు. కోవిడ్ 19 కోసమే అద్భుతంగా ఆ హాస్పిటల్‌ను తీర్చిదిద్దారు. కానీ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నా అక్కడ ఆ హాస్పిటల్ ఖాళీగా దర్శనమిచ్చింది. మరోవైపు అధిక శాతం నమోదవుతున్న కరోనా కేసులతో పనిఒత్తిడి పెరిగి గాంధీ వైద్యులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రేవంత్ ఈ రెండు విషయాలను కూడా సరైన టైంలో అందుకున్నారు. గచ్చిబౌలి టిమ్స్‌ను స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను వివరించారు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతున్నదీ అందరికీ స్పష్టంగా అర్థమైంది. అయితే టిమ్స్‌లో ఇప్పటి వరకు డాక్టర్లు, సిబ్బందిని ఎందుకు నియమించలేదు, హాస్పిటల్ ప్రారంభమైనా, కోవిడ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా.. అక్కడ సేవలు ఎందుకు అందించడం లేదు.. అనే విషయాలను పక్కన పెడితే.. రేవంత్ సరైన టైంలో అక్కడ ప్రత్యక్షమై సడెన్‌గా సంచలనానికి తెరలేపారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్‌లో ఖాళీగా ఉన్న 499 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఈ విషయాన్ని రేవంత్ విజయంగా అభివర్ణిస్తున్నారు.
అయితే రేవంత్ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుండడం, బర్నింగ్ ఇష్యూలపై మాట్లాడుతుండడం, సరైన అంశాలను అందిపుచ్చుకుని అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తుండడం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ తోడు లేకున్నా.. ఒక్కడే.. ఒంటరిగా వెళ్తూ.. సమస్యలపై ప్రశ్నిస్తుండడం.. వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఒక లింకు ఉండడం.. తదితర విషయాలన్నింటినీ గమనిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ముఖ్య నాయకుడిగా దర్శనమిస్తున్నారు. అయితే ముందు ముందు ఇలాంటి ఇష్యూలనే ఎంచుకుని మరింత దూకుడుగా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు అవడం ఖాయంగా కనిపిస్తోంది.