ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగిందని…తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉపఎన్నిక పై చర్చించామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు చర్చించామని.. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని తెలిపారు.
పార్టీలో క్రమశిక్షణ పై కూడా అధిష్ఠానంతో చర్చించాం… పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం కోరిందన్నారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. అభ్యర్థి అంశంపై జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని.. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత.. మా పార్టీ కార్యకర్త. ఆయన సమయాభావం వల్ల సమావేశానికి రాలేదని రేవంత్ తెలిపారు. వెంకటరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చ జరిగిందని.. అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలుస్తారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తాం.. నేతలంతా సమిష్టిగా మునుగోడు లో పని చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.