మునుగోడులో రేవంత్ ముందడుగు…!

-

సిట్టింగ్ సీటుని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే కసితో కాంగ్రెస్ పార్టీ…మునుగోడులో బాగా కష్టపడుతుంది…ఇప్పటికే వరుసగా ఓటములతో కుదేలైపోయిన పార్టీకి మునుగోడు గెలిచి పునర్వైభవం తీసుకురావాలని ఆ పార్టీ నేతలు కష్టపడుతున్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు..అయితే ఎప్పటిలాగానే అంతర్గత కుమ్ములాటలు పార్టీలో ఉన్నాయి. మునుగోడులో కూడా పలు గ్రూపులు ఉన్నాయి. దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే నష్టం జరగకుండా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్ధి ఎంపికలో ఆచి తూచి వ్యవహరించాలని చూస్తున్నారు. తొందరిపడి అభ్యర్ధిని ఎంపిక చేయకుండా…కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్ధిని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు…అలాగే సీటు దొరకని నేతలని సైతం సముదాయించాలని చూస్తున్నారు. ఏదేమైనా అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీల కంటే మునుగోడుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే పనిచేయడం మొదలుపెట్టేసింది.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే…ఈ నెల 5న మునుగోడులో భారీ సభ పెట్టి కార్యకర్తలకు రేవంత్ ధైర్యం ఇచ్చారు…అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు…కోమటిరెడ్డి వెనుక వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మునుగోడులో సంస్థాగతంగా బలంగా ఉన్న కమ్యూనిస్టుల మద్ధతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టు సోదరులు కలిసిరావాలని  పిలుపునిచ్చారు.

ఇక తాజాగా రేవంత్…మునుగోడులో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ నెల 13న ఆయన పాదయాత్ర మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో కొనసాగుతుంది. అలాగే, ఈ నెల 14 నుంచి 17 వరకు వరుసగా మండలాల వారీగా పార్టీ నేతలతో రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక నియోజకవర్గంలో 175 గ్రామాలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది కాంగ్రెస్‌ కీలక నేతలకు ఒక్కొక్క గ్రామాన్ని కేటాయించి వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఒకరోజు పాదయాత్రకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. అదేవిధంగా కోమటిరెడ్డి బీజేపీలో చేరిన వెంటనే…పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై మునుగోడులో ఆందోళన కార్యక్రమాలు చేయనున్నారు. ఇలా అన్నిరకాలుగా మునుగోడుపై పట్టు సాధించేందుకు రేవంత్ పనిచేస్తున్నారు. మరి ఇక్కడైనా గెలిచి పట్టు నిలుపుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news