రచయిత్రి, విద్యావేత్త, సామాజికవేత్త సుధామూర్తి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సుధామూర్తి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుకలో ఆమె కుమార్తె అక్షతా మూర్తి కూడా పాల్గొన్నారు.
అయితే సుధామూర్తి పద్మభూషన్ పురస్కారం అందుకోవడంపై ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, కుమార్తె అక్షతా మూర్తి స్పందించారు. తమకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. సుధామూర్తి కుమార్తె అక్షతామూర్తి తన తల్లికి దక్కిన గౌరవంపై గర్వపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టారు.
‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి మా అమ్మ పద్మభూషణ్‌ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వపడ్డాను. సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారు. ఆమె జీవితం నాకొక స్ఫూర్తి. గుర్తింపు కోసం ఆమె ఎప్పుడూ ఎదురుచూడరు. బుధవారం పొందిన గుర్తింపు గొప్ప అనుభూతినిచ్చింది’ అంటూ అక్షత చేసిన పోస్టుపై రిషి సునాక్ స్పందించారు. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ వ్యాఖ్యను జోడించారు.
ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుధామూర్తి పలు అనాథాశ్రమాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు.