రౌండప్‌ 2022: స్టార్టప్‌లో కోతలు..తగ్గిన జీతాలు.. ఇంటికి ఉద్యోగులు.. ముడిపడిన మూన్‌లైటింగ్‌..!

-

ఇప్పుడు ఉద్యోగులందిరిలో ఒకటే ప్రశ్న.. ఉంచుతారా, పీకుతారా..? ఉద్యోగం ఉంటే ఆఫీస్‌కు వెళ్లాలా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తారా..? దిగ్గజ కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీల వరకూ అందరికి ఉద్యోగులు భారం అయిపోయారు. ఏదో ఒక సాకు చెప్పి వాళ్లను విధులనుంచి తప్పిస్తున్నారు. వారానికి వందల చొప్పున రిజైన్లు వస్తున్నాయి.. మనకు ఎప్పుడు వస్తుందో అని భయపడుతున్నవాళ్లు ఎంతోమంది.. అఫీషియల్‌ మెయిల్‌ డీయాక్టివేట్‌ అయిందా..అంతే మీ పని అయిపోయింది..

సర్దుకోని పోండి అని చెప్పినట్లే.. ఇంతకముందూ ఇయర్‌ ఎండ్‌కు వచ్చే సరికి.. ‘ఏ కంపెనీ ఎంతమందిని నియమించుకోబోతోంది? వేతన పెంపు ఎంత? బోనస్‌లు ఎంత ఇస్తారు.. ఇంకా ఇతర ప్రయోజనాలేమిస్తారు?’ అనే ప్రశ్నలు ఉండేవి… కానీ ఇప్పుడు..‘మీ కంపెనీలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు ఓకేనా? మూన్‌లైటింగ్‌ విషయంలో ఎలా ఉంటున్నారు?’…

ఈ ఏడాది చర్చంతా దాదాపు వీటిపైనే జరిగింది. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే స్టార్టప్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించడం కలకలం రేపింది. మొత్తానికి 2022 సంవత్సరంలో ఉద్యోగాలకు సంబంధించిన వివిధ అంశాలు నిత్యం చర్చకు వస్తూనే ఉన్నాయి.. ఆ కంపెనీలో అంత మందిని తీసేశారంట.. ఈ కంపెనీలో అసలు వెకెన్సీలే లెవంట ఇలా ఏదో ఒక పంచాయితీ తెరమీదకు వస్తూనే ఉంది.

కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు ఐటీ సహా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఇంటి నుంచి పని చేసే విధానానికి చాలా మంది అలవాటు పడిపోయారు. కష్టమో నష్టమో.. ఆఫీస్‌ కంటే చాలా యాంగిల్స్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమే బాగుంది.. అయితే, పనితీరు నెమ్మదించడం, ఉత్పాదకత తగ్గడం వంటి కారణాలతో కంపెనీలు మళ్లీ అందర్నీ ఆఫీసులకు రప్పించేందుకు ఈ ఏడాది విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ, అదంత సులువు కాదని తెలిసి.. మధ్యేమార్గంగా హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరించడం ప్రారంభించాయి.

అయితే, మధ్య మధ్యలో కరోనా పలకరించి పోతుండటంతో వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కానీ ఈ హైబ్రీడ్‌ విధానం వల్ల ఏ సుఖం లేదు. చాలామంది ఉన్నఊరిని వదిలిపెట్టి నగరాల్లో అద్దెలు కట్టుకుంటూ ఉద్యోగం చేస్తారు. ఇలా వారంలో రెండు మూడు రోజులు ఆఫీస్‌లకు వెళ్లి..రెండు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ ఇవ్వడం వల్ల అటు ఇంటికి రాలేమం.. బయట ఉండే ఖర్చులు ఎలాగూ అవుతున్నాయి.. అదేదో పూర్తిగా అయినా ఆఫీస్‌కు పిలవండి లేదా పూర్తిగా అయినా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వండి అని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

‘మూన్‌లైట్‌’పై భిన్న వాదనలు

ఒక కంపెనీలో పనిచేస్తూ అదనపు ఆదాయం కోసం మరో కంపెనీలో పనిచేయడాన్ని మూన్‌లైటింగ్‌గా అంటారు. ఈ ఏడాది ఎక్కువగా చర్చకొచ్చిన అంశాల్లో మూన్‌లైటింగ్‌ కూడా ఒకటి.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి దీనికి ఆజ్యంపోసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో నిర్దాక్షణంగా తీసేసింది.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ సైతం దీన్ని తప్పుబట్టాయి. అదే సమయంలో స్విగ్గీ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ‘మూన్‌లైటింగ్‌’కు అనుమతించడం గమనార్హం.

‘మూన్‌లైటింగ్‌’ వల్ల ఉద్యోగి ఉత్పాదకత తగ్గడంతో పాటు, కంపెనీ రహస్యాలు పోటీ కంపెనీలకు తెలిసే అవకాశం ఏర్పడుతుందనేది దీన్ని వ్యతిరేకించే వారి వాదన. అదే సమయంలో ఉద్యోగి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ‘మూన్‌లైటింగ్‌’ ఉపయోగపడుతుందని సమర్థించేవారూ కూడా ఉన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రభుత్వం ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చట్ట ప్రకారం ఒక కంపెనీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉద్యోగి మరో కంపెనీలో పనిచేయడం సరికాదని స్పష్టంచేయడం ద్వారా భిన్న వాదనలకు ఫుల్‌స్టాప్‌ పడింది..

స్టార్టప్‌ల్లో ఉద్యోగ కోతలు..

2022లో ఆందోళనకర పరిణామాల్లో స్టార్టప్‌లో ఉద్యోగాల కోత ఒకటి. స్టార్టప్‌లకు స్వర్గధామంగా పేరొందిన మన దేశంలో ఈ తరహా పరిణామాలు కొంత ఆందోళన కలిగించాయి.. ముఖ్యంగా కరోనా సమయంలో విపరీతమైన ఆదరణ పొందిన ఎడ్యుటెక్‌ కంపెనీలైన బైజూస్‌, అన్‌ అకాడమీ, వేదాంతు.. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోతకు పాల్పడ్డాయి. బైజూస్‌ 2500 మందిని, అన్‌ అకాడమీ 1500, వేదాంతు 1100కు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. వీటితో పాటు.. ఓలా, బ్లింకిట్‌, ఓయో, మీషో, వైట్‌ హ్యాట్‌ జూనియర్‌, కార్స్‌ 24, జొమాటో వంటివీ ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 18 వేల మంది ఉద్యోగుల్ని స్టార్టప్‌ కంపెనీలు ఇంటికి పంపించాయి.

మాంద్యం భయాల కారణంగా ఐటీ సహా ఇతర రంగాల్లో నియామకాల్లో వేగం కొంత మేర తగ్గిందనేది వాస్తవమే…వచ్చే ఏడాదీ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే, నైపుణ్యాలు మెరుగుపర్చుకునే వారికి మాత్రం పెద్ద ఇబ్బంది ఉండదని చెబుతున్నారు నిపుణులు. మన దగ్గర స్కిల్స్‌ బాగా ఉంటే భయపడాల్సిన పని లేదు.. అటు ఇటుగా ఉన్నవాళ్లనే కంపెనీలు టార్గెట్‌ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news