వరంగల్ జిల్లాలో పని చేస్తున్న ఓ మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శిగా ఉన్న శుక్రవారం బైరీ సోనీ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అయితే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోనిది ప్రభుత్వ హత్యే అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంటే, కేసీఆర్ ప్రభుత్వం వారిపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నాలుగేళ్ల పాటు వారితో పని చేయించుకొని ఇప్పుడు వారి బలవన్మరణానికి కారణం అవుతున్నారని విమర్శించారు. జేపీఎస్‌లపై ప్రభుత్వం వ్యవహరించే విధానం రాజ్యాంగ విరుద్ధమైనదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ, మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని, అందుకు సహాయనిరాకరణ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన భైరి సోనికి నివాళిగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఆ గ్రామంలోని మహనీయుల విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని, పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ మిత్రులు కూడా మీ ఆఫీసుల్లో తోటి ఉద్యోగిని సోనికి నివాళి అర్పించి వారి కుటుంబానికి బాసటగా ఉండాలని కోరారు. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాల్లో చేరకుంటే, కొత్త వారిని నియమించుకుంటాం అనడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ విచ్చలవిడి అవినీతి, విద్వేషపూరిత రాజకీయాల నుంచి కాపాడి, రాతియుగంలోకి పోకుండా దేశాన్ని కాపాడిన ప్రజలకు జేజేలు తెలిపారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్, బీజేపీ నిరంకుశ, అవినీతి రహస్య కూటమిని గద్దె దించి, ఇక్కడి ప్రజలు బహుజన రాజ్యాన్ని నిర్మించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.