తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ మరో తీపికబురు. బతుకమ్మ, దసరా పండగల్లో ప్రయాణికుల రద్దీని పురస్కరించుకొని TSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు కలిపి మొత్తం 4198 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టిఎస్ఆర్టిసి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ.శ్రీధర్ తెలిపారు. ఆర్టీసీ చైర్మన్, ఎండిల ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సులను కూడా సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈనెల 24 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. ఈ సర్వీసులన్నీ ఎంజిబిఎస్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, దిల్ సూక్ నగర్, గౌలిగూడ, సిబిఎస్ తదితర ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఏదైనా కాలనీలో 30 మంది, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు సౌలభ్యం కూడా ఉందని వెల్లడించారు.