ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో భాగంగా మొదట్లో దేశ రాజధాని కీవ్‌ను ముట్టడించేందుకు రష్యా విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ ప్రాంతాన్ని ముట్టడించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో కీవ్ ముట్టడికి భారీ ప్రయత్నం జరగొచ్చని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. దేశ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ప్రస్తుతం చాలా వరకు యుద్ధం.. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే, రాజధానిని మరోసారి లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బలగాలను సమీకరించడం, యుద్ధానికి సిద్ధమవడమే మా ముఖ్యమైన విధి’ అని వాలేరీ జాలుజ్నీ తెలిపారు. ఇదిలా ఉండగా.. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్‌వర్క్ ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైంది. విద్యుత్ అంతరాయాల కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోతున్నారు.