తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో ‘చెలిమి’, ‘అంకురం’ కార్యక్రమాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులు అభ్యసిస్తేనే జాతినిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేలా చిన్ననాటినుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు మంత్రి సబితా పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు ప్రపంచంలో వ్యాపారం చేసే వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు మంత్రి సబితా చెప్పారు.
విద్యార్థులకు ఉన్నత శిఖరాలను చేరడంపై, సాధికారులను చేయడంతో పాటు వీలైన అవకాశాలు లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి తనకు తానుగా సమాయత్తం చేసుకొనే నైపుణ్యాలు నేర్చుకునేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్చుకునే ఓపిక, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.