నాగార్జునసాగర్‌ బీజేపీ వర్గపోరు..ఊరూరా ఫ్లెక్సీలు.. విందుపార్టీల సందడి

-

ఉపఎన్నికకు ఇంకా షెడ్యూల్‌ ప్రకటించకుండానే నాగార్జునసాగర్‌ బీజేపీలో వర్గపోరు రాజుకుంది. ప్రచార రథాలు సిద్ధం చేసుకుని కవ్వించుకుంటున్నారు నాయకులు. కిందటి ఎన్నికల్లో కనీసం ఓట్లు సంపాదించలేని చోట.. ఇప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వేడి రగిలిస్తున్నారు కమలం పార్టీ నాయకులు.


దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి దూకుడు మీద ఉన్న బీజేపీ.. నాగార్జునసాగర్‌లోను దానిని రిపీట్ చేయాలని వ్యూహలు రచిస్తోంది. సాగర్ ఉపఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలో దించి జెండా ఎగురవేయాలని చూస్తోంది. జానారెడ్డి కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని చెప్పడం.. గట్టి అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్‌ అన్వేషణ చూసిన బీజేపీ నాయకులు.. ఆ రెండు పార్టీలకు ధీటుగా వ్యూహ రచనపై ఫోకస్‌ పెట్టారు. నియోజకవర్గంలో అంతర్గతంగా సర్వే చేయిస్తూ.. 45వేల ఓట్లు ఉన్న యాదవ సామాజికవర్గానికి సీటు ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారట.

ఇదే సమయంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పార్టీలో రేస్‌ మొదలైంది. మొన్నటి వరకు పార్టీ ఎవరికి సీటు ఇస్తే వారే పోటీ చేసేవారు. అభ్యర్థి దొరకడమే మహా ప్రసాదంగా భావించేవారు. కానీ… దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత సీన్‌ మారిపోయిందట. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నివేదిత రెడ్డికి 2వేల 675 ఓట్లే వచ్చాయి. డిపాజిట్‌ దక్కలేదు. అయితే ఇప్పుడు లెక్క మరోలా ఉంటుందని చెబుతున్నారు కమలనాథులు.

2014లో టీడీపీ నుంచి పోటీ చేసి దాదాపు 27వేల ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్‌ ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కోసం అంజయ్య యాదవ్‌, నివేదిత రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరు కాకుండా ఇంకా ఎవరైనా బలమైన నేత ఉన్నారేమోనని అన్వేషిస్తోంది బీజేపీ. పార్టీ వైఖరి ఇలా ఉంటే.. టికెట్‌ ఆశిస్తోన్న నాయకులు మాత్రం వర్గపోరుకు తెరతీశారట. నివేదితారెడ్డి భర్త శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నివేదిత నాగార్జునసాగర్‌ బీజేపీ ఇంఛార్జ్‌. దీంతో తానే అభ్యర్థినంటూ ప్రచారం మొదలుపెట్టేశారామె. ఊరూరా ప్రచార రథాలను తిప్పేస్తున్నారు. ఇదంతా చూసిన అంజయ్య తానెక్కడ వెనకబడతానోనని ఆయన కూడా హడావిడి మొదలుపెట్టారు. అనుచరులతో ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నారు. విందు పార్టీలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుని గ్రామాల్లో పర్యటనలకు సిద్ధమవుతున్నారట.

నల్లగొండ జిల్లా బీజేపీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉన్నాయి. ఆ ప్రభావం నాగార్జున సాగర్‌లోనూ కనిపిస్తోందన్నది పార్టీ నేతల టాక్‌. దుబ్బాకలో విజయం సాధిస్తే.. పార్టీ నాయకులు కలిసి సంబరాలు చేసుకోలేదు. ఏ వర్గానికి ఆ వర్గమే విజయోత్సవాలు నిర్వహించాయి. నివేదితకు టికెట్‌ ఇవ్వొద్దన్ని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి హైదరాబాద్‌ నేతలకు చెబుతున్నారట. ఆయన ఓపెన్‌గానే కడారి అంజయ్యను సపోర్ట్‌ చేస్తున్నారట. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. బీజేపీ నేతల హడావిడి చూసిన వారు ఆశ్చర్యపోతున్నారట. మరి.. ఈ వర్గ పోరుకు పార్టీ పెద్దలు ఎలా బ్రేక్‌ వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news