హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అమ్మేస్తున్నారు!!

-

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను శ‌ర‌వేగంగా ప్ర‌యివేటీక‌రించాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఉన్న ప్ర‌భుత్వం ఆ దిశ‌గా మ‌రింత వేగంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు క‌ర్మాగారంతోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్ర‌యివేటీక‌ర‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా న‌రేంద్ర‌మోడీ స‌ర్కార్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబ‌యి, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్ర‌యివేటీకరించాలని నిర్ణయించింది. అందులోని వాటాలను విక్రయించడం ద్వారా రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తొలి దశ ప్ర‌యివేటీక‌ర‌ణ‌లో భాగంగా మంగళూరు, తిరువనంతపురం, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, గౌహ‌తి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్ర‌యివేటు ప‌రం చేయ‌డానికి మొత్తం 13 విమానాశ్రయాలను గుర్తించిన ప్ర‌భుత్వం పై వాటిల్లో నాలుగింటిపై నిర్ణ‌యం తీసుకోనుంది.

కేంద్రం తెలివితేట‌లు

విమానాశ్రయాల అమ్మకం విషయంలో కేంద్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ముంబ‌యి విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉండ‌గా, మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది.

కొత్త‌వాటికోసం ఉన్న‌వాటిని అమ్ముతున్నారు

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విషయానికి వస్తే ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ ర‌మార‌మి ఇదే వాటా ఉంది. 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కొత్త‌గా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలంటే నిధుల కొర‌త ఉంద‌ని, ఇప్పుడున్న మౌలిక స‌దుపాయాల రంగంలో ప్ర‌భుత్వ ఆస్తుల‌ను విక్ర‌యించి, ఆ వ‌చ్చిన సొమ్ముల‌ను కొత్త‌వాటిలో పెట్ట‌డ‌మే స‌రైన దారిగా క‌న‌ప‌డుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఆ ప్ర‌కార‌మే కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌బోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news