మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఒక్కటే ఉంటే చాలదు..ఇవి కచ్చితంగా ఉండాలండోయ్..!

-

కొనే టూత్ పేస్ట్ లో ఉప్పుందా లేదా అనే చాలామంది చూస్తారు.. నిజానికి టీవి యాడ్స్ కూడా.. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అనుకుంటూ వస్తాయి.. మనం వాడే పేస్ట్ లో.. ఉప్పు, మంచి సువాసన మాత్రమే ఉంటే సరిపోదండీ.. ఇప్పుడు చెప్పుకోబేయేవి అన్నీ ఉండాలి. అప్పుడే పళ్లు ఆరోగ్యంగా, ముత్యాల్లా మెరుస్తాయి. మరి అవేంటో చూద్దామా..!

ఫ్లోరైడ్..

ఫ్లోరైడ్ టూత్‌ పేస్ట్‌లో ముఖ్యంగా ఉండే పదార్థం. ఇది పళ్లకు కావిటీస్‌ రాకుండా సంరక్షిస్తుంది. పళ్ల ఎనామెల్‌ తొలగిపోకుండా కాపాడుతుంది. పళ్లు త్వరగా పాచి పట్టకుండా చేస్తుంది. టూత్‌ పేస్ట్‌లో ఫ్లోరైడ్‌ ఉంటే పళ్లు త్వరగా పుచ్చవు. మీరు ఏ టూత్‌ పేస్ట్‌ కొన్నా.. ఫ్రోరైడ్‌ ఉందో లేదో చూసుకోండి.

అబ్రాసివ్‌..

ఇది టూత్ పేస్ట్ లో కచ్చితంగా ఉండాలి.. అబ్రాసివ్‌ మీ పళ్లపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అబ్రాసివ్‌లలో కాల్షియం కార్బోనేట్, డీహైడ్రేటెడ్ సిలికా జెల్, హైడ్రేటెడ్ అల్యూమినియం ఆక్సైడ్ ఉంటాయి. ఇది దంతాలకు హాని కలిగించకుండా దంతాల ఉపరితలాన్ని సున్నితంగా క్లీన్ చేస్తుందట.

టేస్ట్ ఎలా వస్తుంది..

ఫ్లోరైడ్, అబ్రాసివ్‌లు దంతాలను శుభ్రపరచడంలో, సంరక్షించడంలో సహాయపడతాయి. కానీ ఈ రెండు పదార్థాలకు ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు. టూత్‌పేస్ట్‌కు తీపి టేస్ట్‌ రావడానికి సాచరిన్‌, సార్బిటాల్‌ లాంటి ఏజెంట్లు వేస్తారు. టూత్‌పేస్ట్‌లలో చక్కెర అస్సలు ఉండకూడదు.

సున్నితత్వం తగ్గించేలా..

కొన్ని సార్లు చల్లని నీళ్లు తాగితే.. పళ్లు జివ్వమంటాయి. ఏదైనా ఆహారం తీసుకున్నా గాని పళ్లు సున్నితంగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు.. మీ టూత్‌ పేస్ట్‌ మీకు రిలీఫ్‌ ఇస్తుందో లేదో చూడాలి. మీరు వాడే టూత్‌ పేస్ట్‌‌లో పొటాషియం నైట్రేట్, స్టానస్ ఫ్లోరైడ్, స్ట్రోంటియం క్లోరైడ్ ఉంటే.. మీ పళ్ల సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. దంతాలలోని నరాలు జివ్వుమని లాగకుండా అడ్డుకుంటాయి. మీ పళ్ల సున్నత్వం తగ్గుతుంది.
కాబట్టి.. టూత్ పేస్ట్ లో ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవడం మంచిది. ఏదో ఒకటి.. కలర్ బాగుంది, ప్యాకింగ్ యాట్రాక్టివ్ గా ఉంది, ఉప్పు ఉందిగా చాల్లే అనుకుని కాకుండా.. ఇవన్నీ ఏ టూత్ పేస్ట్ లో ఉంటాయో గూగుల్ చేయడం లేదా.. వైద్యులను సంప్రదించి అలాంటి పేస్ట్ లు వాడటం మంచిది.. ఏమంటారు..?
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news