నాడు బాబు.. నేడు జ‌గ‌న్‌.. సేమ్ భంగ‌పాటు..!

-

ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో టీడీపీకి, వైసీపీకి ఒకే ల‌క్ష్యం ఉంది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌కీయంగా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నా.. పోల‌వ‌రం క‌ట్టాలి. వెనుక‌బ‌డిన జిల్లాల‌ను అభివృద్ది చేయాలి. కార్పొరేష‌న్ల‌కు నిధులు ఇవ్వాలి. రాష్ట్రంలో అక్ష‌రాస్య‌త‌ను పెంచాలి. రాజ‌ధాని విష‌యాన్ని తేల్చాలి. విభ‌జ‌న చ‌ట్టంలోని హ‌క్కుల‌ను సాధించాలి. కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టాలి! ఇవ‌న్నీ.. ఈ రెండు పార్టీలు పెట్టుకున్న ల‌క్ష్యాలే. రాజ‌కీయంగా టీడీపీ, వైసీపీ విభేదించినా.. ల‌క్ష్యాల సాధ‌న విష‌యంలో విభిన్న మార్గాల‌ను ఎంచుకున్నా.. చివ‌రికి ఏపీ ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద పీట వేశాయి.

కానీ, ఎటొచ్చీ.. ఈ రెండు పార్టీల అధినేతలు.. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల విష‌యంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆడేసుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు హ‌యాంలో మోడీ ఒక ర‌కంగా ఆలోచించారు. “మేం ఇస్తున్న నిధుల‌ను ఆయ‌న ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. కానీ, మా పేరు ఎక్క‌డా చెప్ప‌డం లేదు“ అని బీజేపీ నేత‌లు త‌ర‌చుగా విమ‌ర్శించేవారు. ఈ విష‌యంపైనే అప్ప‌ట్లో సోము వీర్రాజు స‌హా మ‌రికొంద‌రు నాయ‌కులు కేంద్రానికి లేఖ‌లు సైతం రాశారు. గ్రామీణ స‌డ‌క్ యోజ‌న‌, ఫైబ‌ర్ నెట్ వంటివి కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే అమ‌లు చేస్తున్నార‌ని, అయినా కేంద్రానికి మాత్రం క్రెడిట్ ఇవ్వ‌డం లేద‌ని వీరు ఆరోపించేవారు.

దీంతో..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఈ విష‌యాన్ని గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో పేర్కొన్నారు. బాబు ప్ర‌చార‌క‌ర్త‌. డ‌బ్బులు మావి షోకు ఆయ‌న‌ది అని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప‌రిణామాల‌తోనే ఏపీకి నిదులు ఇవ్వ‌లేద‌నే ప్ర‌చారం ఉంది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ విష‌యాన్ని చూద్దాం.. ఈయ‌న అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో కేంద్రం నిధులు ఉంటే. ఖ‌చ్చితంగా బీజేపీ నేత‌లు అడ‌గ‌క‌పోయినా.. బీజేపీ పేరును పెట్టేస్తున్నారు. రైతు భ‌రోసా ఈ కోవ‌కు చెందిందే.  దీనికి ఆయ‌న పీఎం కిసాన్ పేరును కూడా జోడించారు. అయినా.. కేంద్రం ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

దీనికి ఏకైక స‌మాధానం.. మోడీకి న‌చ్చ‌ని విధంగా సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే..! అంటే.. రాష్ట్రాల‌న్నీ మోడీకి న‌చ్చే విధంగా పాలించాలా ? అంటే.. రాజ్యాంగం అలా చెప్ప‌లేదు. కానీ, వ్య‌క్తిగ‌త రాజ్యాంగాలు ఎవ‌రికి వారే రాసుకున్న ఈ దేశంలో.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచ‌డం, వివిధ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు పందేరం చేయ‌డాన్ని మోడీ తీవ్రంగా భావిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే ఢిల్లీలో ఏపీ ఎంపీలు ఎవ‌రు క‌నిపించినా.. మీకేం.. డ‌బ్బున్న రాష్ట్రం! అని కామెంట్లు చేస్తున్నార‌ని కొంద‌రు చెబుతున్న విష‌యం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌తోనే ఇప్పుడు జ‌గ‌న్‌ను మోడీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news