మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు షాక్ తగిలింది. ఆయన వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ అవ్వబోతున్నట్లు సమాచారం. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టారని, తొందర్లోనే ఆయన యూనిఫాం వదిలేయాల్సి ఉంటుందని తన ఎడిటోరియల్‌లో రాసుకొచ్చింది మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రిక.
ఏ క్షణంలోనైనా షిండే తన ముఖ్యమంత్రి యూనిఫాం తొలగించే అవకాశం ఉందని సామ్నా పత్రిక తన ఎడిటోరియల్ లో రాసుకొచ్చింది. అంధేరి ఈస్ట్ ఉపఎన్నికల్లో షిండే వర్గం తన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని.. బీజేపీ దానిని అడ్డుకుందని వెల్లడించింది. ఇక ఈ మధ్యే జరిగిన గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయంపై వారు చెప్పేదంతా అబద్ధమని, వాస్తవానికి షిండే వర్గంలోని సుమారు 22 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది.
ఎమ్మెల్యేలలో అత్యధికులు ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ తన స్వార్థం కోసం షిండేని వాడుకుంటోందని విమర్శించింది. వాస్తవానికి ప్రభుత్వం తరఫున అన్ని నిర్ణయాలు మాజీ సీఎం, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, వాటిని షిండే ప్రకటిస్తారని చెప్పింది.