మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌

-

ఆప్‌ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరు వారాలకు ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, కొన్ని షరతులు కూడా విధించింది. అనుమతి లేకుండా దిల్లీ దాటి వెళ్లకూడదని, మీడియా ముందు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది.

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్ ఆరోగ్యం గురువారం క్షీణించింది. జైలు గదిలోని బాత్‌రూమ్‌లో ఆయన స్పృహతప్పి పడిపోయారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున పిటిషన్‌ వేసిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ.. జైల్లో ఉన్న సమయంలో జైన్‌ 35 కిలోల బరువు తగ్గారని ధర్మాసనం ముందు విన్నవించారు. పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ అత్యవసర విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరైంది.

Read more RELATED
Recommended to you

Latest news