కరోనా వచ్చిన వారికి జ్వరం, దగ్గు, అలసట, రుచి, వాసనలను పసిగట్టకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని మొదట్లో సైంటిస్టులు చెప్పారు. తరువాత కాలక్రమేణా పలు ఇతర లక్షణాలను కూడా ఆ జాబితాలో చేరుస్తూ వచ్చారు. అయితే తాజాగా కరోనాకు సంబంధించి ఇంకో కొత్త లక్షణాన్ని సైంటిస్టులు తెలిపారు.
కరోనా వచ్చిన వారికి తలనొప్పితోపాటు నోట్లో, నాలుకపై పూత, అల్సర్లు లాంటివి ఏర్పడుతున్నాయని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టార్ తెలిపారు. అయితే ఇతర ఏ కోవిడ్ లక్షణాలు లేకుండా కేవలం ఈ రెండు లక్షణాలు మాత్రమే ఉంటే వాటిని కొందరు పట్టించుకోవడం లేదని, కానీ ఈ రెండు లక్షణాలు కోవిడ్‌కు సంబంధించినవి కనుక, ఈ రెండు లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని, వెంటనే కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.
ఇక ఆ రెండు లక్షణాలు సాధారణంగా వారంలోగా వాటంతట అవే తగ్గుతాయని, కానీ కోవిడ్ ఉంటే మాత్రం అంత సులభంగా తగ్గవని చెప్పారు. అందువల్ల ఈ రెండు లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా కోవిడ్ టెస్టులు చేయించుకోవడంతోపాటు క్వారంటైన్‌లో ఉండాలని టిమ్ సూచించారు. కాగా కోవిడ్ వచ్చిన వారిలో కొందరికి చూపు సరిగ్గా కనిపించకపోవడం, గుండె సమస్యలు, జుట్టు ఎక్కువగా రాలడం వంటి సమస్యలు కూడా వచ్చినట్లు ఇటీవలే సైంటిస్టులు గుర్తించారు. ఇక తాజా లక్షణాలను కూడా కోవిడ్ లక్షణాల జాబితాలో చేర్చారు. అందువల్ల ఈ లక్షణాల పట్ల కూడా ప్రజలు అవగాహన పెంచుకుంటే మంచిది.