జ‌గ‌న్ టార్గెట్‌… బాబు వ్యూహం మ‌ళ్లీ రివ‌ర్సే…!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోను, తెలుగు మాధ్య‌మం విష‌యంలోనూ జ‌గ‌న్‌పై బుర‌ద త‌ను జ‌ల్ల‌డ‌మే కాకుండా జాతీయ‌స్థాయిలోనూ ఈ రెండు అంశాల‌ను చంద్ర‌బాబు బ‌లంగా తీసుకువెళ్లారు. కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. జాతీయ‌స్థాయిలో నేత‌ల‌ను కూడ‌గ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే. ఆయ‌న‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌లేదు. కొంద‌రు స‌హ‌క‌రించినా.. ఫ‌లించ‌లేదు. అలాంటి ప‌రిణామ‌మే ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది.

అదే.. ఫోన్ ట్యాపింగుల వ్య‌వ‌హారం. జ‌గ‌న్ స‌ర్కారు ఫోన్ల‌ను ట్యాపింగ్ చేస్తోంద‌ని, ఇది దేశ ద్రోహంతో స‌మాన‌మ‌ని, దీనిపై విచార‌ణ జ‌రిపి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ.. చంద్ర‌బాబు ఏకంగా ప్ర‌ధానికి లేఖ‌రాశారు. ఈ విష‌యం రాజ‌కీయంగా పెను దుమారం రేపుతుంద‌ని, జ‌గ‌న్‌ను బోనెక్కిస్తుంద‌ని, కేంద్రం కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీ సులు జారీ చేస్తుంద‌ని, తాను మ‌రింత‌గా దీనిని అందిపుచ్చుకుని జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయొచ్చ‌ని బాబు వ్యూహం ప‌న్నారు.

అయితే, అనూహ్యంగా ఈ వ్య‌వ‌హారం బెడిసి కొట్టింది. అప్ప‌ట్లో రాజ‌ధాని విష‌యంలో ఎలా అయితే.. బీజేపీ నేత‌, ఎంపీ, జీవీఎల్ జోక్యం చేసుకుని, రాజ‌ధాని విష‌యంలో మాకు (కేంద్రం) సంబంధం లేద‌ని చెప్పారో.. ఇప్పుడు ఆయ‌న వెనువెంట‌నే స్పందించారు. ప్ర‌ధానికి చంద్ర‌బాబు రాసిన తాజా లేఖ‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. అస‌లు న‌ల‌భై ఏళ్ల సీనియార్టీ ఉంద‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆకాశ‌రామన్న మాదిరిగా లేఖ‌లు రాస్తే.. చూస్తూ కూర్చోడానికి, చ‌ర్య‌లు తీసుకోడానికి కేంద్రానికి ప‌నిలేదా ? అక్క‌డేమైనా ఖాళీగా కూర్చుంటున్నార‌ని అనుకుంటున్నారా? అంటూ ఎదురు దాడి చేశారు.

అదే స‌మ‌యంలో ఎవ‌రి ఫోన్లు ట్యాపింగ్ జ‌రిగాయో చెప్పాలి క‌దా?  నిర్దిష్ట‌మైన ఆరోప‌ణ చేయాలి క‌దా? అన్నారు. అదే స‌మయంలో ఆల్రెడీ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చిన విష‌యంపై కేంద్రానికి ఎలా ఫిర్యాదు చేస్తార‌ని నిప్పులు చెరిగిన జీవీఎల్‌.. గ‌తంలో చంద్ర‌బాబు త‌న ఫోన్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేసింద‌నే విష‌యం వెలుగు చూసిన‌ప్పుడు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు త‌న లేఖ‌ను తాను స‌మ‌ర్ధించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news