రాజోలులో రాజకీయ వాతావరణం వాడివేడీగా ఉంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలా రోజులుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్గ విభేదాలు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మరో వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారి పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. దీంతో అధికార పార్టీలో కొనసాగుతున్న కొందరు నాయకులు రాజీనామాల బాట పడుతున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు. దీంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. కేవలం పార్టీ పదవినే కాకుండా.. ఆ పార్టీలోని ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అతనితోపాటు అతని అనుచరులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపించారు. అయితే వైసీపీ పార్టీకి ఇప్పటి వరకు కష్టపడి పని చేసినా.. కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రుద్రరాజు పేర్కొన్నారు.