అగ్నిప‌థ్ : కోలుకున్న సికింద్రాబాద్ .. అదిగో రైళ్లు !

-

అదిగో రైలు
మ‌ళ్లీ కొత్త ఆశ‌ల‌తో
ఈ రైలు మీకు జీవితాన్ని ఇచ్చింది
అని మ‌రువ‌కండి.. మ‌రో భ‌ద్ర‌మైన ప్ర‌యాణం
రేప‌టి మార్పుల‌కు నాంది కావొచ్చు…
భ‌యాన‌క వాతావ‌ర‌ణం నుంచి రైలు నిల‌యాలు కోలుకుంటున్నాయి.  ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంట‌ల పాటు ఆందోళ‌న‌ల‌తో ఠారెత్తిపోయిన స్టేష‌న్లన్నీ ఇప్పుడిప్పుడే సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. పౌరులు కూడా య‌థావిధిగా త‌మ రైలు ప్ర‌యాణాల‌కు ప్రాధాన్య‌మిస్తూ వెళ్తున్నారు. కొన్ని మార్పుల‌తో అగ్నిప‌థ్ నోటిఫికేష‌న్ రానుంది అని., సైన్యంలో యువ‌త చేరిక షురూ కానుంది అని సంబంధిత ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ఆందోళ‌న‌ల్లో పాల్గొని, ఆస్తుల విధ్వంసానికి పాల్ప‌డి  ఎఫ్ఐఆర్ న‌మోదు అయి ఉంటే వారంతా సైన్యంలో చేరేందుకు అన‌ర్హులు అని సంబంధిత వ‌ర్గాలు నిర్థారిస్తున్నాయి. అలాకాకుండా ప్ర‌భుత్వంతో త‌మ గోడు చెప్పుకునేందుకు శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలిపి, చ‌ర్చ‌ల్లో పాల్గొన్న వారు అర్హులు అని భార‌త సైన్యాధిప‌తులు స్ప‌ష్టం చేస్తున్నారు.

త్రివిధ ద‌ళాల‌కూ సంబంధించి అక్క‌డ చేయ‌బోయే రిక్రూట్మెంట్ కు సంబంధించి జ‌రిగిన నిర‌స‌న‌లు చ‌ల్లారాయి. అగ్నిప‌థ్ ను వ్య‌తిరేకిస్తూ యువ‌త సికింద్రాబాద్ తో స‌హా దేశంలో ప‌లు రైల్వే స్టేష‌న్ల‌లో అల్ల‌ర్లు సృష్టించిన ఘ‌ట‌న‌లు ఇప్పుడిప్పుడే సర్దుమ‌ణుగుతున్నాయి. ముఖ్యంగా  అల్ల‌ర్ల‌తో అట్టుడుకుపోయిన సికింద్రాబాద్ స్టేష‌న్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.
కొన్ని రైళ్లు మిన‌హా నిన్న‌టి వేళ వివిధ సర్వీసులు య‌థాత‌థంగా న‌డిచి ప్ర‌యాణికుల‌ను గ‌మ్య స్థానాల‌కు చేర్చాయి.

దీంతో సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచిగూడ స్టేషన్ల‌లో ల‌క్ష‌కు పైగా ప్ర‌యాణికులు రాక‌పోక‌లు సాగించారు. సోమ‌వారం నుంచి అన్ని రూట్ల‌లో రైళ్ల‌ను న‌డ‌ప‌నున్నారు. కట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ రైల్వే స్టేష‌న్లు అన్నీ త‌మ కార్యాక‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి అని అధికారులు చెబుతున్నారు. రైల్వే  ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ నిరంతర  నిఘాతో కార్య‌కలాపాలు సాగుతున్నాయి.

ఇక  స్టేష‌న్ల‌లో సాధార‌ణ పరిస్థితులు తీసుకు రావ‌డానికి రైల్వే అధికారులు చేప‌ట్టిన చ‌ర్యలు అన్నీ ఒక్కొక్క‌టిగా స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. మ‌రోవైపు అగ్నిప‌థ్ నియామ‌కాల‌కు సంబంధించి ఆర్మీ తో స‌హా మిగ‌తా కీల‌క విభాగాధిప‌తులు స‌న్న‌ద్ధం అవుతున్నారు.సైన్యంలో అగ్నిప‌థ్ నియామ‌కాల‌కు సోమ‌వారం డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నారు. అనంత‌రం పూర్తి వివ‌రాలు సంబంధించి రిక్రూట్మెంట్ యూనిట్లు జూలై ఒక‌టో తేదీ నుంచి జారీ చేస్తాయి. అగ్నిప‌థ్ స్కిం కింద సైన్యంలో చేరేందుకు ఆస‌క్తి ఉన్న యువ‌తను చేర్చుకునేందుకు ఆగ‌స్టు, సెప్టెంబ‌రు, అక్టోబ‌ర్ లలో ర్యాలీల‌ను దేశ వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్నామ‌ని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ బ‌న్సీ పొన్న‌ప్ప తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news