జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో, పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ప్రకటించాలన్నారు. వారాహి యాత్రలో పవన్ మాటలకు, చేతలకు పొంతనలేదని విమర్శించారు. చంద్రబాబు వెనక వెళ్తే ఎమ్మెల్యే కూడా కాలేరని ఎద్దేవా చేశారు. అంతేగాక, రామ్మోహన్ నాయుడికి మైక్ కనపడితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారని, దాని వల్ల జిల్లాకు ఏం ఉపయోగమని అప్పలరాజు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. పనికి మాలిన ఎంపీలకు ర్యాంకింగులు ఇస్తే అందులో ప్రథమ స్థానంలో నిలిచేది రామ్మోహన్ నాయుడేనని అన్నారు.
జిల్లాకు ఆయన ఏం చేశాడో గుండెలమీద చేయి వేసుకుని చెప్పాలని అప్పలరాజు నిలదీశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేశానో చాలా చెప్పగలనని అన్నారు. తాను కిడ్నీ ఆసుపత్రి,వాటర్ ప్రాజెక్టులను తీసుకోచ్చానని తెలిపారు. జిల్లా ప్రతిపక్ష నేతలంతా వచ్చి తన మీద వ్యక్తిగతంగా దాడి చేసినప్పటికీ పోయేదేం లేదని అన్నారు.