గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ముందస్తు లేనట్లే కనిపిస్తుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి వరకు ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు మంత్రి కేటీఆర్ ఇచ్చినప్పటికి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు, బాధితులకు సహాయ చర్యలు ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం వాటి మీదే దృష్టి పెట్టడంతో 2021 సంక్రాంతి తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
సంక్రాంతి తరువాత జనవరి చివరివారంలో షెడ్యూలు విడుదలై, ఫిబ్రవరి మొదటివారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాలకవర్గం గడువు ముగియడానికి దాదాపు మూడు నెలల సమయం ఉన్నందున అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి.