ఆ జిల్లాలో పదవి ఒకరిది పెత్తనం మరొకరిది

-

ఎమ్మెల్యే పదవి చేతిలో ఉంటే ఆ లెక్కే వేరు అన్నట్టు ఉంటుంది ఈ జిల్లా నేతల తీరు. కొందరు నాయకులైతే ఎమ్మెల్యేలకు మించిన పవర్‌ తమ దగ్గర ఉన్నట్టు ఫోజులు కొడతారు. వీరందరినీ మించిన వారు ఇంకొందరు. ఎమ్మెల్యేలకే షాడోలుగా మారిపోతారు. ప్రజలు ఎన్నుకున్నవారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి..పెత్తనం చెలాయిస్తుంటారు. అలాంటి వారిపైనే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వైసీపీ ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు. పేరుకు ఎమ్మెల్యేనే అయినా.. ఇక్కడ అధికారం అంతా మరో వైసీపీ నేత అనంత ఉదయ భాస్కర్‌దేనని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఉదయ భాస్కర్‌ డీసీసీబీ చైర్మన్‌ కూడా. రంపచోడవరంలో పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ పనులు ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయట. గతంలోనూ ఇక్కడ అదే జరిగిందని చెబుతారు.

ఇదే జిల్లాలో టీడీపీ నుంచి రాజమండ్రి అర్బన్‌లో గెలిచిన మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారామె. అయినా ఒక ఎమ్మెల్యేగా ఆమె ఉనికి చాటుకోవడం లేదన్న విమర్శ ఉంది. టీడీపీ అధికారంలో లేకపోవడంతో చురుకుగా లేరని అనుకోవడానికి లేదంటాయి పార్టీ శ్రేణులు. ఇక్కడ పార్టీ, ఎమ్మెల్యే హోదాలో పెత్తనం అంతా భవానీ భర్త ఆదిరెడ్డి వాసుదేనట. ఆమె కూడా భర్త చాటు భార్యగానే రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటారట. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట ఆదిరెడ్డి వాసు.

జిల్లాలో సెంటిమెంట్ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు సైతం సైలెంట్‌ అయ్యారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే పీఏ షాడోగా మారినట్టు అప్పట్లో దుమారం రేగింది. తనకు బదులుగా పీఏను.. మండలానికో నాయకుడిని షాడోగా దొరబాబే పెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు పొరుగు నియోజకవర్గం కాకినాడకు చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హవా కూడా ఇక్కడ చర్చగా మారింది. కోనసీమలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం రిమోట్‌ కంట్రోల్‌గా మారిపోయినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఆయన సోదరుడు షాడోగా ఉంటున్నారట.

ఎమ్మెల్యేలు గెలిచి 20 నెలుల దాటింది. ఈ విషయంలో అధికార పార్టీ, విపక్ష ఎమ్మెల్యేల తీరు ఒకేలా ఉంది. నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టు సాధించకపోవడం.. షాడోలను ప్రోత్సహిస్తుండటం కేడర్‌ను గందరగోళంలోకి నెడుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news