బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే ఇష్టపడని వారుండరు. ఓవైపు సినిమాలు.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్గా బిజీగా ఉండే బాద్షా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరిగా నిలవడమే కాదు, పేరున్న హాలీవుడ్ నటులైన టామ్ క్రూజ్, జార్జ్ క్లూనే, జాకీచాన్, రాబర్ట్ డి నైరో వంటి వారిని సైతం వెనక్కి నెట్టారు. షారుఖ్ మొత్తం ఆస్తి విలువ 770 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనవంతులైన నటుల జాబితాలో జెర్రీ షెన్‌ఫెల్డ్ 1 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి, అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత టేలర్ పెర్రీ (1 బిలియన్ డాలర్లు), డ్వేన్ జాన్సన్ (800 మిలియన్ డాలర్లు) టాప్-3లో ఉన్నారు. నాలుగో స్థానంలో 770 మిలియన్ డాలర్లు (రూ. 63,740,982,690)తో షారుఖ్ ఉండగా, టామ్ క్రూజ్ (620 మిలియన్ డాలర్లు), జాకీ చాన్ (520 మిలియన్ డాలర్లు), జార్జ్ క్లూనే (500 మిలియన్ డాలర్లు), రాబర్ట్ డి నైరో (500 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
షారుఖ్ నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పలు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలను నిర్మిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రినిడాడో నైట్ రైడర్స్ జట్లకు సహ భాగస్వామిగా ఉన్నారు. పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న ఆయన భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.