ఏపీలో బీజేపీ అంటే బాబు-జగన్-పవనా..? అని శైలజానాధ్ సెటైర్లు విసిరారు. ఏపీలోని పార్టీలు మోడీ విధానాలు ఎందుకు వ్యతిరేకించడంలేదు..? ఇప్పటికైనా అగ్నీపధ్ లాంటి స్కీములను వ్యతిరేకించాలి.. లేదంటే యువతకు వ్యతిరేకులు అని భావించాలన్నారు. రాష్ట్రంలోని పార్టీలు వారి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారు… విభజన హామీలు సాధించే సమయం వచ్చింది , కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ రాష్ట్రపతి అభ్యర్థికి అడగక ముందే తోక ఊపుకుంటూ మద్దతు పలికిందని… బయట బీజేపీ- వైసీపీ చేసుకునే విమర్శలంతా బూటకమని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హోదా, హామీలు అమలు చేస్తామనే వాళ్ళకే మద్దతు ఇవ్వాలని… అలా హామీలు ఇవ్వని వాళ్లక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ వేయకండని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో అగ్నిపధ్ స్కీమును వ్యతిరేకిస్తున్నామని… నరేంద్ర మోడీ తన మిత్రులకు దేశాన్ని దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మోడీ నాయకత్వంలో దేశం సర్వ నాశనం అయిందని.. ప్రధాని మోడీ ఆదాని లాంటి వాళ్ళ కోసం పని చేస్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలివ్వడానికి అన్ని అడ్డం వస్తాయని.. కాంట్రాక్ట్ పద్దతిలో యువతను సైన్యంలోకి తీసుకుంటున్నారని చురకలు అంటించారు.