బైలెల్లుదామా యాదాద్రి..!

-

ఎన్నో ఏళ్ల ఘనచరిత్ర ఉన్నటువంటి యాదాద్రి ఆలయం వెనుక అనేక రహస్యాలు,అంతు చిక్కని  నిజాలు,ఆలోచనలకు అందని  అద్భుత ఆకారాలు,చూడగానే కన్నుల పండుగగా కనిపించే మహా అద్భుత నిర్మాణాలు ఆనాటి కాకతీయుల నిర్మాణాలను
ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆలయ  నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఒక కళ ఖండాన్ని ఉమ్మ‌డి నల్గొండ జిల్లాలో సృష్టించింది. భారతదేశంలో తిరుపతి ఎలా ఉంటుందో, అంతటి మహాద్భుతంగా కాకతీయుల కళ ఉట్టిపడేలా అక్కడికి వెళ్ళగానే మనసు ఆహ్లాదంగా అనిపించేలా ఆలయ నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేప‌థ్యాన దేవాలయ పురాతన చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!

లక్ష్మీ నరసింహుడు ఎలా వెలిశాడు:

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలోని  ఎంతో ఎత్తయిన గుట్టపై ఉన్నటువంటి దేవాలయం ఈ యాదాద్రి ఆలయం. తెలంగాణలో అన్ని ఆలయాల కంటే ఈ దేవాలయానికి ఘన చరిత్ర కలిగి ఉంది.  ఋష్యశృంగ మహర్షి, శాంత దంపతుల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నప్పటి నుండే హరి భక్తుడు. ఆనాడు ఆంజనేయస్వామి ఆదేశాల మేరకు  ప్రస్తుతం యాదగిరి గుట్టగా పిలువబడుతున్న స్థలంలో చాలా ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆ సమయంలో  ఒక రాక్షసుడు  ఆహార వేటలో అటుగా వచ్చి ఘోర తపస్సు లో ఉన్నటువంటి ఈ యొక్క ఋషిని చూసి తినబోయాడు. కానీ ఘోర  తపస్సులో ఉన్నటువంటి ఋషి గుర్తించలేదు. తన కోసం తపస్సు చేస్తున్న భక్తుణ్ణి కాపాడాలని  వెంటనే సుదర్శన చక్రం వచ్చి
ఆ రాక్షసుడిని సంహరించింది. అది చూసిన ఋషి ఆ చక్రాన్ని ప్రార్థించి ఇక నుంచి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా, దుష్టులను  సంహరిస్తూ ఇక్కడే ఉండిపోవాలని కోరాడు. దీంతో  లక్ష్మీ నరసింహ స్వామి అక్కడే కొలువుదీరి భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉంటున్నాడని స్థ‌ల పురాణం చెబుతోంది.

 

కేసీఆర్ సంకల్పం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ యాదాద్రి గుట్టను మహా అద్భుతం చేయాలని పూనుకున్నారు. అదే తడవుగా ఐదేళ్లలో యాదగిరి రూపురేఖలు మార్చారు. 2016 అక్టోబర్ 11న యాదాద్రి టెంపుల్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) ఆధ్వర్యంలో  ఆలయ విస్తరణ పనులకు పూనుకున్నారు. ఆనాటి భారత రాష్ట్రపతి ఆలయ నిర్మాణ ప్రణాళికను చూసి మహా అద్భుతం అని ప్రశంసించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న గర్భగుడి ఆలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ విశాలమైన మందిర ప్రాంగణాన్ని నిర్మించారు.
గతంలో మందిరం చుట్టూ ఉన్నటువంటి పాత కట్టడాలన్నీ కూల్చివేసి భవిష్యత్తులో అవసరాలకు తగినట్లుగా అన్ని వసతులతో సప్త గోపురాల అద్భుత ఆలయం నగరంగా తీర్చిదిద్దారు. రాతితో ఆలయాన్ని నిర్మించాలి అంటే ఒకప్పుడు దశాబ్దకాలం పట్టేది. అలాంటిది యాదాద్రి ఆ దేవాలయాన్ని నిర్మించడానికి కేవలం ఐదు సంవత్సరాలు పట్టడం మహాద్భుతం. పాంచరాత్ర, ఆగమ, వాస్తు శాస్త్ర, శిల్పా శాస్త్రాలను అనుసరించి ఈ ఆలయాన్ని కృష్ణ శిలతో నిర్మించారు. భారత శిల్పుల నైపుణ్యానికి ఆధునిక సాంకేతికతను జోడించి ఈ మహా అద్భుతం సృష్టించారు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి. ఆలయ నిర్మాణానికి ఎనిమిది వేల టన్నుల రాయి ఉపయోగించారని తెలుస్తోంది. ఆలయ నిర్మాణం మొత్తం కంప్లీట్ గా కృష్ణ శిల‌తోనే నిర్మించడం ప్రపంచంలోనే మొదటిదని  తెలుస్తోంది.

 

కొండపైన నిర్మాణాలు

రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో యాదాద్రి గుట్టకు పడమర దిక్కున ఉన్న పెద్ద గుట్ట మీద టెంపుల్ సిటీ నిర్మాణ పనులను చేపట్టారు. ఇక్క‌డ వెయ్యి ఎకరాల్లో 250 కాటేజీలు నిర్మించారు. భక్తులు నడకదారిలో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకునేలా కనుమదారిలో స్వాగత గోపురం దారి మధ్యలో సేద తీరేలా పచ్చదనం నిండేలా పార్కు నిర్మించారు. కొండ పైకి వాహనాలు వచ్చి వెళ్లేందుకు వేర్వేరుగా రెండు ఘట్ రోడ్ల  నిర్మాణం. ఇక కొండ పైన గర్భాలయంలో స్వామి వారి యొక్క సన్నిధి ద్వారం తలుపులకు 16 కిలోలతో చేస్తున్న బంగారు తాపడం చూప‌రుల‌ను ఎంతో ఆకర్షిస్తుంది. భ‌క్త ప్రహ్లాద చరిత్ర , స్వామివారి ఉగ్రనార‌సింహ సన్నివేశాలు కూడా చెక్కిన విధానం ఆక‌ట్టుకుంటోంది.ఆండాళ్ అమ్మవారి సన్నిధి,ఆంజనేయ సన్నిధి,బలిపీఠం ధ్వజస్తంభం అన్ని ప్రత్యేక రీతిలో చెక్కిన శిల్ప నైపుణ్యానికి తార్కాణాలే !  అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కొండ కింద రెండు వందల ఎకరాల్లో మహా సుదర్శన యాగం అలాగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు చేయడం కోసం ప్రత్యేక నిర్మాణం చేపట్టారు. ఇలా ఐదు సంవత్సరాల్లో దాదాపుగా 12 వందల కోట్ల రూపాయలతో  ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి  మహా చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఎన్నో ఏళ్ల కల, రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఈరోజు సీఎం కేసీఆర్  మహా సంప్రోక్షణ ఉత్సవాలలో  పాల్గొని, స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

– పాండ్రాల మోహన్

Read more RELATED
Recommended to you

Latest news