శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్..ఏడు డివిజన్లలో ఎవరి సత్తా ఎంతంటే

-

మల్టీనేషనల్‌ కంపెనీలకు.. ఐటీ దిగ్గజ ఆఫీసులకు కేరాఫ్‌ అడ్రస్.. శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్. ఆకాశాన్ని తాకే అంతస్తులు, అపార్ట్‌మెంట్లు.. మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌.. స్టోర్స్‌..! కళ్లు తిరిగే భవనాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి. అధునాతన హంగులతో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, కేబుల్‌ బ్రిడ్జ్‌… ఇవే అభివృద్ధి అనుకుంటే పొరపాటు. వీటి చాటునే కనీస అవసరాలు లేని కాలనీలు.. అభివృద్ధికి నోచుకోని బస్తీలు బోలెడు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో… గ్రేటర్‌ రాజకీయాలు ఎలా ఉన్నాయి. పార్టీల బలాబలాలేంటంటే…

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం… జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పొచ్చు. ఇక్కడ గజం జాగాకు లక్షలు పెట్టాల్సిందే. ఫ్లాట్లు విల్లాలు కొనాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు గ్రేటర్ డివిజన్లు ఉన్నాయి. శేర్‌లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌.. ఈ ఏడు డివిజన్లు.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. వినడానికి ఇవన్నీ బాగా అభివృద్ధి చెందిన డివిజన్లలా అనిపించినా… ఇక్కడా సమస్యలెన్నో… అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఏరియాలు చాలానే ఉన్నాయి.

ముందుగా గచ్చిబౌలి డివిజన్ తీసుకుంటే, క్లాసు, మాసు కలగలిసి ఉండే డివిజన్ ఇది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇదే డివిజన్‌లో వెలుగు కింద చీకటిలా కొన్ని బస్తీలున్నాయి. గచ్చీబౌలి డివిజన్ విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ ఇక్కడ 42 వేల మంది ఓటర్లే ఉన్నారు. నివాస ప్రాంతాలకంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. కమర్షియల్ సిటీగా పేరుంది. ఈ డివిజన్‌ నుంచే గత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేటీఆర్. అప్పుడు గచ్చిబౌలిలో గులాబీ జెండా రెపరెపలాడింది. అద్దాల మేడల వెనకే అభివృద్ధికి నోచుకోని బస్తీలు గచ్చిబౌలి డివిజన్‌లో ఉన్నాయి. ఎలాంటి మౌలిక వసతులు లేని ఎన్టీఆర్‌ నగర్‌తోపాటు అస్తవ్యస్తమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలున్న ఏరియాల్లో ఖాజాగూడ, నానక్‌రాంగూడ ఉన్నాయి.

ఓ పక్క హైటెక్ ఏరియా.. మరోపక్క మురికివాడల కలయికగా ఉంటుంది శేరిలింగంపల్లి డివిజన్. ఇక్కడ 62 వేల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగేందర్ యాదవ్ విజయం సాధించారు. సిట్టింగ్ కార్పొరేటర్‌పై బిల్డర్లను బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తారన్న ఆరోపణలున్నాయి. కబ్జాల్లోనూ కాకలు తీరారన్న మాట స్థానికంగా వినిపిస్తుంది. డివిజన్‌లో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నోటిఫైడ్ స్లమ్స్ ఎక్కువగా ఉన్న డివిజన్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్లమ్స్‌ ను గుర్తించాయి. కానీ మౌలిక వసతుల కల్పనలో మాత్రం ముందుకు రాలేదు. ఇళ్లుంటాయి కానీ రోడ్లు లేవు. డ్రైనేజీ పైపులేశారు కానీ మురికినీరు పోదు. ఎన్నోఏళ్ల నుంచీ ఎక్కడి సమస్యలక్కడే.

శేర్‌లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో మరో డివిజన్ మియాపూర్‌. ఇక్కడ 56వేల మంది ఓటర్లున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మేక రమేష్ విజయం సాధించారు. ఆయన చనిపోవడంతో ఈసారి శ్రీకాంత్‌కు టికెట్‌ ఇచ్చారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో గతంలో టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ డివిజన్‌లోని బస్తీలను చూస్తే అసలు ఇవి గ్రేటర్లోనే ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. మియాపూర్ డివిజన్ ఓల్డ్ బాంబే హైవేకు ఆనుకుని ఉంటుంది.. అయితే మెయిన్ రోడ్ నుంచి సూపర్‌గా కనిపించే ఈ డివిజన్లో ఓ అడుగు లోపలకు వేస్తే తెలుస్తుంది అసలు రంగు. మియాపూర్లో తొమ్మిది బస్తీలున్నాయి.

శేరిలింగంపల్లిలో మరో డివిజన్‌ కొండాపూర్‌. ఈ డివిజన్‌లో 76వేల మంది ఓటర్లున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలకే కాదు.. కంపుకొట్టే బస్తీలకూ అడ్డా కొండాపూర్‌. బడాబడా ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీలున్న చోట ఎన్నో మురికివాడలు. గత ఎన్నికల్లో టీడీపీపై టీఆర్‌ఎస్ అభ్యర్ధి హమీద్ పటేల్ ఇక్కడ విజయం సాధించారు. కొండాపూర్ డివిజన్లో హైటెక్ హంగులెంతుంటాయో.. స్లమ్స్‌ కూడా అంతే ఉన్నాయి. హైటెక్‌ జనాలు తిరిగే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే రోడ్లు వేస్తారు. నాలాలు కడ్తారు. క్షణాల్లో ఇతర సదుపాయాలు కల్పిస్తారు. కానీ బస్తీల్లోకి వెళ్తే డివిజన్ సొగసు బయటపడుతుంది. అంజయ్యనగర్, సిద్ధిఖ్‌నగర్ బస్తీల్లో అడుగడుగునా డ్రైనేజీ గుంతలు. రోడ్ల నిండా మురికినీరు.. చెత్తా చెదారమే దర్శనమిస్తుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 110వ డివిజన్‌ చందానగర్‌. ఒకప్పుడు పసుపు జెండా రెపరెపలాడిన చందానగర్‌ గడ్డపై ఇప్పుడు గులాబీ జెండా ఎగురుతోంది. గత ఎన్నికల్లో నవతారెడ్డి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలుపొందారు. కానీ… ఈ సారి టికెట్‌ దక్కించుకోలేకపోయారు. సిట్టింగ్‌లలో సీటు కోల్పోయిన వారిలో నవతారెడ్డి కూడా ఒకరు. చందానగర్‌లో 59 వేల మంది ఓటర్లుండగా…ఏడు బస్తీలున్నాయి. ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా అపార్ట్‌మెంట్లు వెలిశాయి. గ్రేటర్‌లో రియాల్టీ పరుగులు పెడుతున్న ఏరియాల్లో చందానగర్‌ ఒకటి. హఫీజ్‌పేట డివిజన్ల్లో బస్తీలు కాలనీలు ఎక్కువ.ఇక్కడ ముస్లీంప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

మొత్తానికి శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో… ఏడు డివిజన్లలో ఈసారి హోరాహోరీ పోరు జరగబోతుంది. సీమాంధ్రుల ప్రభావం ఎక్కువ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి కావడంతో ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందోననే ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news