హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్ నాడార్ దాతృత్వంలో బాహుబలిగా నిలిచారు. 2021-22లో రూ.1,161 కోట్లు విరాళంగా ఇచ్చి దాతృత్వంలో నంబర్ వన్ గా నిలిచారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను విరాళంగా అందించారు.
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానానికి చేరారు. వరసగా రెండు సంవత్సరాల పాటు ఈ జాబితాలో ప్రేమ్‌జీ తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో ఏడోస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చారు.
ఈ ఏడాది ఆరుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రోహిణీ నిలేకని రూ.120 కోట్లు, లీనా గాంధీ తివారీ రూ.21 కోట్లు, అను అగా రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ వితరణ చేసిన వారి సంఖ్య గత నాలుగేళ్లలో 116 శాతం పెరిగి 80కి చేరింది. అత్యధిక విరాళాలు విద్య కోసం అందాయి. తర్వాత కొవిడ్ నివారణ చర్యల కోసం కూడా భారీ ఎత్తున విరాళాలొచ్చాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారి సగటు వయసు 69 ఏళ్లు. ప్రాంతాలవారీగా చూస్తే ఈ జాబితాలో ముంబయి నుంచి 33 శాతం మంది, దిల్లీ నుంచి 16 శాతం, బెంగళూరు నుంచి 13 శాతం మంది ఉన్నారు. ఫార్మా పరిశ్రమ (20 శాతం) నుంచి ఎక్కువ మంది దాతలు ఉన్నారు. రసాయనాలు, పెట్రోకెమికల్స్ తర్వాతి స్థానంలో ఉంది.