ఈ నెల 18న మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా, ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, వేదపండితులు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈ రాత్రి 7 గంటలకు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు.
దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి స్పందిస్తూ, బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అన్నదాన వసతి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. భక్తులు భారీగా తరలి వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు సేవలు నిర్వహించనున్నారు. 11వ తేదీన ధ్వజారోహణ, 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం చేపట్టనున్నట్లు అధికారులు వ్యక్తపరిచారు.